October 29, 2009

పునర్వివాహ ప్రాప్తిరస్తు ! !

తిరుమల అనే పదమే పవిత్రమైనదిగా భావిస్తారు హిందువులు. ఇక వేంకటేశుడంటే చెప్పక్కర్లేదు. ఫ్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా భక్తులు సందర్శించే ప్రదేశాలలో తిరుమల ఒకటి. అత్యధికంగా విరాళాలు పొందే దేముడు వేంకటేశుడు. ఆయన తరపున భక్తుల ఆలన పాలన చూసేది తిరుమల తిరుపతి దేవస్తానం. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ధర్మ ప్రచారం చేయడం దాని విధులలో ఒకటి. కాని ఈ మధ్య టి టి డి నిర్నయాలు ధర్మ ప్రచారం కంటే రాజకీయ ప్రచారానికే మగ్గు చూపుతోందని అనిపించక మానదు. వాటిలో మొదటిది దళిత గోవిందం. దళితులకు తిరుమలో ప్రవేశం నిషిద్ధం కాదు. వేంకటేశుడిపై విశ్వాశం ఉన్న అన్య మతస్తులు కూడా స్వామివారిని దర్శించవచ్చు. అలాగే అందరూ వేంకటేశుడిని దర్శించుకుంటున్నారు కూడా. అలాంటి పరిస్థితులలో వేంకటేశుడిని ప్రత్యేకంగా దలితులవద్దకు తీసుకువెళ్ళవలసిన అవసరం లేదు. కేవలం అది ఒక రాజకీయ నాయకుల వక్ర బుద్ధి. లేనిపోని వివక్షను ఎత్తి చూపడమే. చివరికి ఒక న్యూస్ చానల్ వాడలో ఊరేగించిన విగ్రహాలను గర్భ గుడిలో కాక మరో చోట ఉంచారని వార్త. ఉత్సవ విగ్రహాలను గర్భ గుడిలో ఎప్పుడూ ఉంచరు. కానీ ఆ విషయాన్ని అనవసరంగా రాద్ధాంతం చేశారు. అలాగే ఇప్పుడు కళ్యాణమస్తు కార్యక్రమం. మరి ఈ ఆలోచన ఎవరికి వచ్చిందో వారికి పునర్వివాహ ప్రాప్తిరస్థు. ఎందుకంటే ఈ కార్యక్రమం లో పెళ్ళి చేసుకొనే కొందరు తమ పిల్లలతో పాటు కూర్చొని భార్యని మళ్ళీ పెళ్ళి చేసుకోవడం, మారు వివాహాలు చేసుకోవడం వార్తలలో చూస్తున్నాము. దీనికి కారణం అధికారులకు టార్గెట్లు ఇవ్వడమే. ఒక వూరిలో నిర్వహించే కార్యక్రమానికి తప్పనిసరిగా వొందమంది ఉండాలని టిటిడి అధికారులకు ఏలినవార్లు హుకుం జారీ చేస్తే జరిగే ఉపద్రవం ఇది. ఇదివరకు డాక్టర్లకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం కొన్ని కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు తప్పనిసరిగా చేయాలని ఆదేశాలు ఇచ్చేది. అలా ఉంది ఈ విషయం కూడా. కొంతలో కొంత సంతోషం వారు కేవలం పెళ్ళిళ్ళు చేసి అంతటితో అగేరు. కాని ఇలాంటి విషయాల వల్ల అధ్యాత్మిక విషయలు పక్క దారి పట్టే ప్రమాదం ఉంది. వారి దృష్టి కేవలం ధర్మ ప్రచారం పైనా సేవా కార్యక్రమాలపైన ఉంచితే మన అందరికి మంచిది.