విద్య నేర్పే గురువు సాక్షాత్తూ భగవత్ స్వరూపంగా చెపుతారు. అలాంటి భగవత్ స్వరూపమే మా మాస్టారు. ఆజానుబాహుడు. ఎప్పుడూ ఖద్దరు బట్టలే కడతారు. పొడవైన అంగీ, పంచె కట్టు, భుజంపై మువ్వన్నేల రంగుతో ఉండే కండువా, మొఖంలో తేజస్సు, గాంభీర్యం, ఏ విషయాన్నైనా తెలియ చెప్పగల విఙ్నానం ఆయన సొత్తు. చూడగానే చెయ్యెత్తి నమస్కరించాలని అనిపించేలా ఉంటారు. ఆయన చేతిలో ఎప్పుడూ పుస్తకాలుండేవి. అవేమిటో తెలుసుకొనే సాహసం మాకు ఉండేది కాదు. ఆయన క్లాసులోకి వస్తే చాలు పిల్లలందరమూ బుద్ధిమంతులుగా కూర్చుండి పోయేవాళ్ళం. అలాగని మమ్మల్ని ఎప్పుడూ మందలించిన పాపాన కూడా పోలేదు. ఆయన చెప్పేది చాలా శ్రద్ధగా వినేవాళ్ళం. ఆయన చెప్పే విషయాలు చాలా ఆసక్తిగా ఉండేవి. ఊరి పెద్దలలో ఆయన ఒకరు. అనేక సలహాలు సంప్రదింపులు ఆయనతో జరిగేవి. రోడ్డుపై ఆయన నడిచి వెడుతూ ఉంటే గౌరవంతో అందరూ పక్కకు తప్పుకొనే వాళ్ళు. ఇన్ని విశిష్ట లక్షణాలున్న ఆయన ఒక దళిత వర్గానికి చెందినవాడు. వారికి కులాన్ని అంటగట్టి పాపం మూటగట్టుగోవడం నా ఉద్దేశ్యం కాదు. సంస్కారం అనేది కులాన్ని బట్టి రాదు అని చెప్పడమే నా ఉద్దేశ్యం. గొప్ప వ్యక్తులకు మతం రంగు, కుల కంపులు అంటవు అని చెప్పడమే నా ఉద్దేశ్యం. వ్యక్తిత్వం అనేది కేవలం పుస్తకాలు చదవడంవల్ల రాదు అని చెప్పడమే నా ఉద్దేశ్యం. మర్యాద అనేది అడిగి తీసుకొనేది కాదు అని చెప్పడమే నా ఉద్దేశ్యం. సంఘంలో మనలని ఎవ్వరూ పట్టించుకోరు అనడం బ్రమ అని చెప్పడమే నా ఉద్దేశ్యం. నీ మాటలు, నీ నడవడికే సంఘంలో నీకొక స్థానన్ని కల్పిస్థాయి అని చెప్పడమే నా ఉద్దేశ్యం. మహాత్మ గాంధీ కూడా జాతి వివక్షను చవి చూశాడు. దానివల్ల ఆయన్లోని నాయకత్వ లక్షణాలు మరింత పెరిగాయికాని నశించి పోలేదు. ఇలాటి ఎందరో మహానుభావులు. అందరికీ వందనాలు!!
సాంఘీకంగా ఏర్పరచుకున్న కట్టుబాట్లని పాటించాలని రాజ్యాంగంలో రాసి లేదు. ఎవరి చిత్తము వచ్చినట్ట్లు వారు నడుచుకోవచ్చు. బ్రాహ్మలు మాంసాహారము తింటానన్నా, మరొకళ్ళు మా సంస్కృతి ప్రకారం గొడ్డు మాంసము తింటానన్నా నిరభ్యంతరంగా తినచ్చు. దొరికితే కుక్క మాంసము కూడా తినొచ్చు. ఈశాన్య ప్రాంతాలలో బంధువులు వచ్చినప్పుడు ప్రత్యేక వంటకంగా కుక్క మాంసమే వండుతారు. నీ స్వేచ్చని కాదనే హక్కు ఎవరికీ లేదు. వండుకు తిన్నా పచ్చిది తిన్నా కూడా కాదనే హక్కు ఎవ్వరికీ లేదు. కానీ నీ అలవాట్లని మరొకరిపై రుద్దటం అనుచితం. నీ స్వేచ్చ నీ వరకే పరిమితం. సాంఘీకంగా సర్వోన్నతుడివి కావాలంటే మాత్రం మెజారిటీ ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా నడవాలి. వారి అభిప్రాయాలతో నీకు పని లేనప్పుడు నువ్వెప్పటికీ ఒంటరివే!!