June 15, 2012

హమ్మయ్య గెలిపించేశాం...ఓ పనైపోయింది!!



ఎలచ్చన్లు అయిపోయాయి...... అనుకున్నదే..ఎర్రిబాగులోళ్ళమంతా గన్‌బాబుని గెలిపుంచుకున్నాము. గన్‌బాబు ఇప్పుడు ప్రజాహోమంలోంచి నూతనంగా జనించిన  సత్శీలుడు. వారి తప్పులనీ ప్రజా "గుండం"లో కాలి ఒప్పులయ్యాయని అవి అస్సలు తప్పులేకావని సదరు పార్టీ వక్తలు చెప్పుకుంటు ఉంటే విని అవునని తలూపడం తప్ప ఎవ్వరూ చేయగలిగింది లేదు. ఇక కాబోయే ముఖ్యమంత్రి వారేనని కూడా ప్రకటించారు. ఇది దేవుడి విజయమని అమ్మగారు చెపితే ఇది కేవలం అన్నగారి విజయమని సోదరి సద్దిచెప్పారు. ఇక ఈ విజయంతో కోర్టులో తప్పులన్నీ ఒప్పులుగా మారిపోతాయని, ఇక గన్‌బాబు బైటకి రావడమే మిగిలిందని ముగించారు. ఇవన్నీ పక్కనబెడితే ప్రబుత్వం పైన అపనమ్మకమే ప్రజలు వారిని పక్కనబెట్టారని చెప్పక తప్పదు. మీరు వందల కోట్లు కాదు వేలకోట్లు తిన్నా పర్వాలేదు కానీ మాకు తాగడానికి గుక్కడు నీళ్ళిస్తే చాలని, చచ్చిపోతుంటే మాకోసం ఒక నాలుగుచక్రాల ప్రభుత్వ వాహనం వస్తే చాలని, ఒకపూట తినడానికి నాలుగు గింజలు చాలని, ప్రస్థుత ప్రభుత్వం అది కూడా చేయట్లేదని ఎలుగెత్తి చెప్పేరు. మరి వారి మాటలు ప్రభుత్వ పెద్దలకు అర్ధమవుతాయా? కానీ గన్‌బాబు గెలిపించుకున్నవారితో లుకలుకలనుండి బైటపడడానికి ప్రభుత్వ పెద్దలతో ఒప్పందానికి వచ్చి,వారితో చేతులు కలిపితే...మళ్ళీ మనం ఎర్రిబాగులోళ్ళమే!!     



June 1, 2012

ఎక్కడో అక్కడ పడనివాడుంటాడా?


"లక్ష కి పడకపోవచ్చు, కోటికి పడకపోవచ్చు, కానీ వందకోట్లు ఇస్తానంటే పడనివాడుంటాడా?" ఇదో సినిమాలోని డైలాగు. సీబీఐ కోర్ట్ జడ్జి పట్టాభిగారి విషయంలో ఇదే జరిగి ఉంటుందా? ఆయన లాకర్లలో దొరికిన డబ్బు కూడా కొంత అనుమానాల్ని దృవీకరిస్తోంది. సుడిగాలి బ్రదర్స్ ( గన్ & గాలి) హస్తవాసి అంత మంచిది కాదని స్పష్టమౌతోంది. వారి చేతిలోంచి ప్రసాదాలు పొందినవాళ్ళెవ్వరూ కూడా సుఖంగా లేరు. చాలామంది జైలుపాలయారు. కొత్తగా మరో వికెట్, అనుకోని వికెట్. తాచెడ్డ కోతి వనమెల్ల చెరిచిందని... వీళ్ళు మింగడమే కాకుండా జనాల్ని ప్రలోభ పెడుతూ వారిని కూడా ఇరకాటంలో పెడుతూ పార్టీల పరువు, కోర్టుల పరువుకూడా తీస్తున్నారు. ఇప్పటికే ఐయేస్ ఆఫీసర్లంటే చులకన భావం వచ్చేసింది. ఇక జడ్జీలకు ఆ పరిస్తితి వస్తే మారింత ప్రమాదకరం. కాబట్టి వీళ్ళని వీఐపీలగా గాక అత్యంత ప్రలోభ పరచలగల వ్యక్తులుగా గుర్తించి  వీరి చాయలకు ఎవ్వరూ రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తే ఎలా ఉంటుంది?