July 13, 2009

గోపి గోపిక గోదావరి & తలనొప్పి

వంశీ సినిమాలంటే నాకో ప్రత్యేక అభిమానం ఉంది. చక్కని సెంటిమెంట్‌తో మలుపులు తిరిగే కధ, హాస్యం మంచి చిత్రీకరణ వంశీ సొంతం. అదే అభిప్రాయంతో గోపి గోపిక గోదావరి సినీమాకి వెళ్ళాను. నాకు చాలా గందరగోళంగా అనిపించింది. టూకీగా కధ ఏమిటంటే గోపీ(వేణు) హైదరబాదులో ఒక ఆర్కెస్ట్రా సింగర్. గోపిక (కమలిని ముఖర్జీ) గోదావరి ఒడ్డున ఉన్న పోలవరంలో ఒక డాక్టర్. గోదావరిలో తిరిగే ఒక లాంచిలో మొబైల్ హాస్పిటల్ నడుపుతూ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలకి వైద్యం చేస్తూ ఉంటుంది. ఒక రోజు గోపికి ఒక మొబైల్ ఫోన్ దొరుకుతుంది. ఆ ఫోన్‌కి గోపిక ఫోన్ చేస్తుంది. ఆ ఫోన్ తనకి దొరికిందని గోపి చెపుతాడు.ఆ ఫోన్ హైదరాబాదులో ఉన్న తన స్నేహితురాలిది అని ఆ ఫోన్‌ను ఆమెకి అందచేయాలని గోపీని గోపిక కోరుతుంది. గోపీ ఆ ఫోన్‌ను తీసుకొని ఆమె వద్దకు వెడితే ఆ ఫోన్ పోవడం మూలాన ఆమెకు ఆమె బాయ్ ఫ్రెండ్‌కు జరిగిన గొడవలవల్ల ఆమె ఆత్మహత్య చేసుకున్నదని తెలుస్తుంది. అదే విషయాన్ని గోపి గోపికకు తెలియ చేస్తాడు. తరువాత స్నేహితురాలి తండ్రి గోపికను కలిసి తన కూతురు ఆత్మహత్య చేసుకున్నప్పుడు గోపి చాలా సహాయం చేసాడని చెపుతాడు. దానితో గోపిక గోపీ ఫోన్ మిత్రులవ్వడం వారిద్దరూ ఫోన్లోనే ప్రేమిచుకోవడం జరుగుతుంది. ఒకసారి హైదరాబదులో కలుసుకోవాలనే వారి ప్రయత్నం ఫలించదు. గోపి తల్లికి విషయం తెలిసి వారి పెళ్ళికి ఒప్పుకోక్పోవడంతో గోపిక గోపీని వచ్చి తన తల్లిని ఒప్పించమని చెపుతుంది. పోలవరం బయలుదేరిన గోపీ మరో గొడవలో ఇరుక్కొని తలమీద గాయంతో గోదావరిలోకి తోసేస్తారు దుడగులు. అతనిని గోపిక చూసి రక్షించి వైద్యం చేస్తుంది. కాని అతనికి తలమీద తగిలిన గాయంవల్ల ఙ్ణాపక శక్తి పోతుంది. అతనని తన హాస్పిటల్‌లోనే ఉంచుతుంది కానీ అతనే తన గోపీ అని తెలియదు. తరువాత అతనికి ఙ్నాపక శక్తి తిరిగి వచ్చినా తనే గోపీని అని చెప్పడు. ఇంతలోఅ గోపీ చనిపోయడని అనుకొని మరో పెళ్ళికి సిద్దపడుతుంది గోపిక. ఆ సమయంలో గోపీ తల్లి అసలు విషయం బయటపెడుతుంది. చివరికి వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకుటారు. మధ్యలో కొన్ని ట్విస్టులు ఉన్నా కధ అంతా చాలా బోరుగా సాగింది.ఇరవై సంవత్సారల క్రితం తీయాల్సిన సినిమ. వంశీ సినీమల్లో సంభాషణల్లో శృంగారం ఉంటుంది. కానీ దీనిలో కాస్త శృతి మించింది . ఫొటోగ్రఫీ కూడా ఏమాత్రం బాగాలేదు. టోటల్‌గా రెండున్నర గంటల సినిమా రెండున్నర యుగాలుగా గడిచింది.

July 9, 2009

హేతువాదులూ మీరు ఆస్తికులా లేక నాస్తికులా?

ఈ మధ్యకాలంలో హేతువాదులమని చెప్పుకోవడం ఒక గొప్ప క్వాలిఫికేషన్ అని జనాలు అనుకుంటున్నారు. హేతువాదమంటే సైంటిఫిక్‌గా నిరూపించబడితేనే వారు ఏ విషయాన్నైనా నమ్ముతారన్నమాట. హేతువాదమనేది ముఖ్యంగా నమ్మకాలతొ ముడిపడి ఉంటుంది. ఆస్తికత్వం పుట్టినప్పుడే నాస్తికత్వం పుట్టి ఉంటుంది.దేముడు ఉన్నాడా లేదా అనే విషయంపై అనాదిగా చర్చలు జరుగూతూనే ఉన్నాయి. బ్లాగుల్లో కూడా ఈ విషయం పై అనేక చర్చలు జరిగే ఉంటాయి. కానీ నాస్తికులకన్నా ఆస్తికులకు కొన్ని అడ్వాంటేజీలు ఉన్నాయి. పొద్దున్నే లేవగానే అద్దంలో చెత్త మొహం చూడకుండా చక్కగా దేముడి మొహం చూసుకోవచ్చు. ఏదైన కష్టం వచ్చినప్పుడు ఓరి దేముడో నేనేమి పాపం చేసేనురో అని దీర్ఘంగా ఏడవచ్చు. మన చేతుల్లో లేని పని ఏదైనా ఉంటే దేముడిపై భారం వేయవచ్చు. గుళ్ళు గోపురాలంటూ చక్కగా ఊళ్ళు తిరగొచ్చు. మరిన్ని అడ్వాంటేజీలు వదులుకొని నాస్తికులు ఏమి సాధిస్తారో నాకు తెలియదు. భూమిమీద గాలి నీరు తిండి ఆవకాయి, మాగాయి అన్నీ ఉన్నాయి.మరే ఇతర గ్రహాలమీద లేవు. ఆస్తికులు ఇవన్ని భగవంతుడి సృష్టి అని తృప్తిగా చెప్పుకుంటారు. కాని నాస్తికులు ఇవన్ని అనుభవిస్తూ కూడా ఇదంతా ఎవరు సృష్టించారో తెలియని సైన్స్ అంటారు. భూమిపై హాయిగా నడుస్తున్నాము, డాన్స్ చేస్తున్నాము. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది కాబట్టే నడవగలుగుతున్నమని అంటే మరి ఇతర గ్రహాలకు ఎందుకు లేదు? సూన్యంలో గ్రహాల్న్ని వలయాకారంలో తిరగడానికి శక్తినిచ్చినదెవరు? చంద్రుడికి లేని గురుత్వాకర్షణ భూమికి ఎలా వచ్చింది? చంద్రుడిలొని చల్లదనం సూర్యుడికి ఎందుకు లేదు? వీటిలోని మంచి లక్షణాలు భూమి ఎలా అందుకోగలుగుతోంది? మనం మురిసిపోయే తొలకరి జల్లులు భూమికే ఎందుకు? ఇవన్నీ మన కళ్ళ ఎదుటి సాక్ష్యాలు. గ్రహ మండలాల గురించి సైన్స్ చెప్పేది చాలావరకు ఊహాగానాలు మాత్రమే. జీవిత కాలం అంతా కనుగొని చెప్పింది పిసరంత. ఇంకా బొలేడు మిగిలి ఉంది. కనిపించేదానికి కారణం చెప్పడానికే ఇంతకాలం పడితే అది సృష్టించబడడానికి ఇంకెంత శక్తి కావాలి? ఆ తెలియని శక్తే భగవంతుడని అనుకుంటున్నారు. అతని రూపం ఊహాజనితం కావచ్చు, కదలికలు ఊహజనితం కావచ్చుగాక ఆడ మగా అనేది కూడా ఊహా జనితం కావచ్చు.అది ఏదైనా ఎవరైనా ఒక శక్తికి ప్రతిరూపం. ఇంకో చిన్న విషయం ఆస్తికుడు చచ్చిపోతూ నేను అందరికి మంచి చేసాను భగవంతుడు మరుజన్మలో నాకు మంచి చేస్తాడు అనే తృప్తితో మరణిస్తాడు. కాని మరుజన్మ లేదనుకొనే నాస్తికుడు నా శరీరంలోని కదలికలు ఇక ఆగిపొతాయి, ఇక నేను చెయగలిగేది ఏమిలేదు అనుకుటూ మరణిస్తాడు. ఇదే ఆస్తికత్వానికి నాస్తికత్వానికి ముగింపులోని తేడా. మీరేమంటారో?

July 7, 2009

తెలుగు బ్లాగరు పారిపోతున్నాడు పట్టుకోండి!!

నేనా రోజు బజారుకు వెళ్ళాను. అంతా చాలా రద్దీగా ఉంది. ఫ్రూట్స్ కొందామని చూస్తూంటే కొందరు వ్యక్తులు ఒక యువకుడిని వెంటపడి తరుముతున్నారు. ఆ యువకుడు ఆ వ్యక్తులనుండి తప్పించుకోవాడినికి వేగంగా పరిగెడుతున్నాడు. ఆ గుంపులో వివిధ వయస్సుల వాళ్ళు ఉన్నారు. కొందరు అరుస్తున్నారు
"ఎలాగైన పట్టుకోండి..మళ్ళీ బ్లాగులో రాయకుండా చితక్కొంట్టండి" అంటున్నారు. మరికొందరు
"పారిపోతే దేశంలో ఎక్కడినుండైనా బ్లాగింగ్ చెశేస్తాడు. చేతులు విరగ్గొట్టండి" అంటున్నారు.
నేను పరిగెడుతున్న గుంపులో ఒక వ్యక్తిని పట్టి ఆపి "ఎందుకు అలా తరుముతున్నారు?" అని అడిగేను.
దానికి అతను " ఏమి చెప్పమంటారు! మేమంతా ఒక మంచి మాట చెప్పుకుందామని, చిన్న నాటి విషయాలు గుర్తుకు తెచ్చుకొని మురవాలని, ఒకరికి తెలిసిన విషయం మరొకరు పౌచుకోవాలెన ఉద్దేశ్యంతో తెలుగు బ్లాగులు ఏర్పాటు చేసుకున్నాము. వీడు మధ్యలో దూరిందే కాకుండా ఎవ్వరికీ ఇష్టం లేని విషయాలు పదే పదే రోజుకు పదిసార్లు రాస్తూ కొన్ని నెలలుగా విసిగించేస్తున్నాడు.విసిగించకురా అని చెప్పినా వినట్లేదు. మా అందరికీ వీడిబానుండీ ఎలా తప్పించుకూవాలో తెలియట్లేదు. అనుకోకుండా ఇప్పుడు దొరికేడు.మరోసారి రాయకుండా చెసేస్తేగానీ వాడికి బుద్ధి రాదు" అన్నాడు ఒగురుస్తూ.
గుంపు ముందుకు సాగిపొయింది.
కొద్దిసేపటికి నా పనులు చక్కబెట్టుకొని తిరిగి వస్తూ ఉంటే ఆ యువకుడు జేబులో చేతులు పెట్టుకొని ఈల వెసుకుంటూ నెమ్మదిగా విలాసంగా ఎదురు వస్తున్నాడు. నేను అతనికి ఎదురు వెళ్ళి అతనిని అడిగాను
" వాళ్ళు నిన్నెందుకు తరుముతున్నారు?" అని.
అతడు చిద్విలాసంగా "నేను దొరకలేదుగా" అన్నాడు.
" సరేగాని విషయం ఏమిటో చెప్పు" అన్నాను.
"నేను కూడా ఒక బ్లాగు రాస్తున్నాను. దాని పేరు 'అ టు అహా కలలు'. దానిలో నాకిష్టమైన హీరో చరణ్‌జీవి గురుంచి రాస్తూ ఉంటాను"
" దానినికి వారికెందుకు అంత కోపం? ఏం రాసేవాడివి" అన్నాను.
" నా హీరో గురించి అన్ని విషయాలు. ఉదయం లేచి నప్పటినుంది పడుకొనే వరకు, సినీ హీరో గా, పార్టీ పెట్టిన హీరోగా, కాబోయే ముఖ్య మంత్రిగా,వివిధ దశలుగా వర్ణించేవాడిని"
"నువ్వేమి చేస్తూవుంటావు?" అడిగాను
"బ్లాగులు రాస్తూ ఉంటాను" అన్నాడు
"రాయడం అయ్యకా ఏమి చేస్తావు?" మళ్ళీ అడిగాను
"మళ్ళా రాస్తాను" అన్నాడు
"రోజూ ఎన్ని సార్లు రాస్తావు?" అడిగాను
"నిద్రొచ్చేదాకా ఒక పది పదిహేను రాస్తాను" అన్నాడు
"మరికాస్త విపులంగా చెపుతావా?" అని అడిగాను.
"నా హీరో చరణ్‌జీవి పార్టీ పెట్టినప్పుడు అతని సిద్ధంతాలు విపులంగా ఊహించి వివరించాను. అతనికి అభిమానులు జైకొడుతున్నప్పుడు అతని పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని చెప్పాను.మీటింగులకి జనం భారీగా వస్తే రెండువందల నలభై సీట్లు వస్తాయని ధీమగా చెప్పాను. ఎవరైనా జోకులేస్తే నాకు చిరాకని రాసేను. కాబోయే ముఖ్య మంత్రి అని చెప్పాను.సీట్లు అమ్ముకొంటున్నారని ఎవరైనా విమర్శిస్తే అంతా భూటకం అని అన్నాను."
"మరి నువ్వు చెప్పినట్ట్లు మీ హీరో పార్టీకి రెండువందల నలభై సీట్లు వచ్చాయా?" నేను
"నలభై కూడా రాలేదు" అన్నాడు
"మరి మీ హీరో ముఖ్యమంత్రి అయ్యాడా?" అని అడిగేను
"ముఖ్య మంత్రి కాదు పోటీ చేసిన స్థానల్లో ఒకచోట ఓడిపొయాడు కూడా" అన్నాడు
"మీ పార్టీ స్థాపకులలో సత్రా కూడా ఒకరు కదా?" అని అడిగాను
"అవును" అన్నాడు
"మరి ఆయనే పార్టీని వదిలి పెట్టి పొతే నువ్వేమి పాముతున్నావు" చిరాగ్గా అడిగాను
"అందుకే ఆయన కొడుకు గురించి రాస్తున్నాను" అన్నాడు
"ఆయన కొడుకు గురించి ఏమి రాస్తున్నావు?" ఆశ్త్చర్యంగా అడిగాను
"కొత్తగా మగవీర సినిమా తీస్తున్నారుగా దానిగురించి" అన్నాడు
"రిలీజ్ కాని సినీమా గురించి నువ్వేమి రాస్తావు?" నేను
"సినీమా చాలా బాగుంటుందని, పాటలు బాగా వస్తాయని" అన్నాడు
అప్పుడు నాకు కాలింది చాలా చాలా...
వెంఠనే నా మొబైల్ తీశాను.
"ఎవరికి ఫోన్ చేస్తున్నారు?" అడిగాడతడు
"తెలుగు బ్లాగర్లకి, నువ్విక్కడ ఉన్నావని చెప్పడానికి" అన్నాను కసిగా
ఒక్క ఉదుటున పారిపోబోయాడు.
నేను పట్టుకున్నాను.
ఐనా విదుల్చుకొని పారిపోయాడు.
మీకుగనక ఎక్కడైనా కనిపిస్తే కాస్త నాక్కూడా చెప్పండి.ప్లీజ్!!

గమనిక: ఈ టపా ఎవరినీ నొప్పించడానికి కాదు. పాత్రలన్ని కల్పితాలు. నవ్వొస్తే నవ్వుకోండి.

July 6, 2009

టెన్షన్..టెన్షన్..టెన్షన్..!!

అప్పుడే తొలకరి మొదలు. ఇంటి అరుగు మీద కూర్చొని చేతులు చాస్తే చేతి పడే చినుకులు బలే అహ్లాదంగా ఉండేది. వెనువెంఠనే వచ్చే మట్టి వాసన కూడా గమంత్తుగా ఉండేది. కొత్తగా బడులు తెరిచేరు. మా క్లాసులోకి మాష్టారు వచ్చి ఒక్కక్క పేరు చదువుతున్నారు. పేరు చదివినవారంతా పాస్ ఐనట్ట్లు. మష్టారు పేరు చెప్పిన వాళ్ళు ఒక్కరూ లేచి వెళ్ళి మరో తరగతి గదిలో కూర్చోవాలి. పేరు చదివే వరకు ప్రతీ ఒక్కరికీ టెన్షనే. క్లాసులో చాలా మంది లేచి వెళ్ళిపొయేరు. నేను చాలా కొద్ది మంది ఉండిపోయేము. మష్టారు మిగిలిన పిల్లలకి వార్నింగులు ఇచ్చారు. వెధవల్లారా రోజూ స్కూలుకి రాకపొతే వచ్చే సంవత్సరం కూడా ఇక్కడే కూర్చోపెడతాను అంటున్నారు. అదేమిటీ నేను రోజూ స్కూలుకి వస్తాను కదా! నన్ను ఫెయిల్ చేయడమేమిటె? నా మొహం అవమానంతో ఎర్రబడింది.కాళ్ళు వణుకుతున్న భావన.కళ్ళలోంచి నీళ్ళు పొంగడానికి సిద్ధంగా ఉన్నాయి. నా ఇంద్రియాలు పనిచేయడం మనేశాయి. మష్టారు పిల్లలని తిట్టే తిట్ట్లు ఎక్కడో దూరం నుంది వస్తున్నట్ట్లు అనిపిస్తోంది. చివరిగా వాళ్ళని ఉద్దేశించి ఈ సంవత్సరమైనా బుద్ధిగా స్కూలుకి రండి అంటూ ముగించి నా వైపు తిరిగేరు. నాతో రా అన్నట్ట్లు తల ఊపి ముందుకి కదిలేరు. నేను ఈ ప్రపంచంలో లేను. చెక్క బొమ్మలా అలాగే నిలబడి ఉన్నాను. అక్కడ ఏమి జరుగుతోందో నాకు స్పృహలో లేదు. ఆయనే మళ్ళీ వెనకు వచ్చి నా చేయి పట్టుకొని ముందుకు కదిలేరు. నేను ఆయన వెంట కదిలేను - ఒక రకంగా లాక్కువెళ్ళేరు. అందరూ వెళ్ళి కూర్చున్న క్లాసుకు కాదు. మరో తరగతికి - ఆ తరువాతి తరగతికి. అక్కడి మేష్టారికి నన్ను అప్పచెప్పి అన్నారు, వీడు తెలివైన వాడు. నా క్లాసులొనే హైయ్యర్ క్లాసు పుస్తకాలు కూడ చదివేశేవాడు. ఒక సంవత్సరం వృధా చేయడం నాకు ఇష్టం లేదు. ఒక సంవత్సరం ముందుకు పంపుదాము. నేను వాళ్ళ నన్నతో మాట్లడతాను. మీరు వీణ్ణీ మీ క్లాసులో కూర్చొబెట్టుకోండి అన్నకగాని నాకు అర్ధం కాలేదు. నాకు డబల్ పాస్ ఇచ్చేరని.

July 3, 2009

మా(టీవి) తుఝే సలాం!

గురువారం రాత్రి తొమ్మిది గంటలకు మా టీవీ చూసిన ప్రేక్షకులందరూ తప్పకుండా భావోద్వేగానికి గురై ఉంటారని భావిస్తున్నాను.రేలారే కార్యక్రమం చూసేక ఇది నాకు కలిగిన భావన. " పల్లే కన్నీరూ పెడుతూందో కనిపించని కుట్రల" అంటూ ప్రముఖ జానపద గాయకుడు వెంకన్న చిందేస్తూ పాడిన పాట ప్రేక్షకుల గుండెను గొంతులోకి తెచ్చింది. నరాల్లో రక్త ప్రవాహం పెరిగి ఒక ఉద్వేగానికి గురై ఉంటారు. గ్లోబలైజైషన్ వల్ల కుల వృత్తులు చేసుకునెవాళ్ళు ఏవిధంగా జీవనం కోల్పోయి ఎలా అనాధలయ్యరో, పల్లెలు ఏవిధంగా బోసిపోయాయో పాడి వినిపిస్తూ ఉంటే ప్రముఖ పాటల రచయితలు సుద్దాల అశోక్ తేజ, చంద్ర బోసులు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. జానపద గీతాలంటే ప్రజలలో మరోసారి క్రేజ్ కలిగించిన ఈ కార్యక్రమం నిజంగా ఒక ఆణిముత్యం. ప్రైవేట్ చానల్స్ మధ్య ఉన్న ఇంత పోటిలో కూడా కొన్ని విలువలకు కట్టుబడి సంస్కృతికి సంభంధించిన కార్యక్రమాలను విజయవంథంగా ప్రజల మధ్యకు తీసుకు వెడుతున్న మా తుఝే సలాం!!

July 2, 2009

గిన్నిరొట్టె కధా కమామిషు!!

మా పెద్ద పరీక్షలు ఐపొయాక వేసంగి శెలవలు ఇచ్చేవారు. అప్పటికే ఎండలు మొదలయ్యేవి.నేను కాస్త సుకుమారుణ్ణే. కొద్దిగా ఎండ తగిలితే చాలు ఒళ్ళంతా పేలి ఎర్రగా ఐపోయేది. అందుకు మా అమ్మ ఇల్లు కదలనిచ్చేది కాదు. పదకొండు కాగానే నేను ఎక్కడ ఉన్నా వెదికి పట్టుకొని ఇంటికి లాక్కు పోయేది. మాది పెంకుటిల్లే. ఎండలు ఎక్కువ ఉన్నా ఇంత బాధించేవి కావు. పెంకుటిల్లు మూలాన వేడి తెలిసేది కాదు. మరీ ఎక్కువ ఉక్కగా అనిపిస్తే పెరట్లో చెట్లకింద చేరే వాళ్ళం. పెరట్లో వేప అరటి నందివర్ధనం చెట్లు నిండుగా ఉండేవి.వేప చెట్టుకింద మడత మంచం వేసుకొని పడుకొనేవాళ్ళం. పైనుండి వేప ఆకులు, చిలుకలు ఉడతలు కొరికి పారేసే గింజలు మీద పడుతూఉంటే వాటిని చేత్తో తీసివేస్తూ పడుకొనేవాళ్ళం. మధ్య మధ్యలో కాకులు కొన్ని చిలిపి పనులు కూడా చేస్తూ ఉండేవి.ఎండ వేడికి నాకు ఒళ్ళు పేలిపోయి మరీ చిట చిటలాడుతోందని గొడవ చేస్తే మధ్యాహ్నం పన్నెండు గంటలకి భొజనాలు అయ్యేక గంధం అరగదీసి ఒంటికి రాసేది. ఆ చల్లదనానినికి హాయిగా నిద్ర పట్టేది. మళ్ళీ ఏ మూడు లేక నాలుగు గంటలకో మెలుకవ వచ్చేది. లేచేటప్పటికి మా అమ్మ నాకిష్టమైన గిన్ని రొట్టె సిద్ధంగా ఉంచేది.గిన్నె రొట్టె అంటే దాదాపు ఇడ్లీ పిండిని చేసినట్టే ముందురోజు చేసి ఉంచేది. దానిని ఉదయం పదకొండు గంటలకి కుంపట్లో బొగ్గులు వేసి దానిపై ఒక ఇత్తడిగిన్నె ఉంచి దానిలో కొంచం నూనె వేసి ఈ పిండి పొసేది. దానిపై మరో ఇత్తడి మూత ఉంచి దానిపైకూడా నిప్పులు పోసి ఉంచేది. రెండువైపుల ఆ నిప్పుల సెగకి నెమ్మదిగా కాలుతూ మధ్యాన్నానికి ఆ రొట్టె ఎర్రగా కాలి కమ్మని వాసనలొతో తయారయ్యేది. అప్పుడు దానిని బైటికి తీసి ముక్కలుగా చేసి దానిపై నేయి వేసి కొత్త ఆవకాయతో నంచుకు తింటే ఆ మజానే వేరుగా ఉండేది. ఇప్పటి పిజ్జాలుగానీ బ్లాక్ ఫారెస్టులుగాని ఎందుకూ పనికి రావు. మధ్య మధ్యలో మా అమ్మకు దొరకకుండా నేను పారిపొయేవాడిని. చింత చెట్లకింద పిల్లలం అందరూ చేరేవాళ్ళం. నెమ్మదిగా చింత చిగురు కోసి దానిని ఒక నాపరాయి మీద ఉంచి మరో రాయి తో మెత్తగా చితకగొట్టి పిల్లలు ఇంటినుండి దొంగచాటుగా తెచ్చిన ఉప్పు కారాలు కూడా దానిలో కలిపి ఆ చాట్‌ను అందరం ఎంతో అప్యాయంగా తినేవాళ్లం. నాపరాయి మీద వేసి కొట్టేటప్పుడు దానిలో కలిసిన ఇసుక పళ్ళమధ్య పడి ఒళ్ళు గగుర్పొడుస్తున్నా ఒదిలిపెట్టేవాళ్ళం కాదు. సాయంత్రం ఐతే మా పడక ఇంటిముండు రోడ్డుమిదే మంచాలు వేసుకొని పడుకొనేవాళ్ళం. పైన చంద్రుడు, కొబ్బరి ఆకుల గలగలలు, కిందనుంది కొద్ది కొద్దిగా మట్టివాసనలు. ఒక్కప్పుడు అర్ధరాత్రి హఠాత్తుగా చినుకులు పదితే మంచాలు ఎత్తి ఇంటి అరుగుమీదకి మార్చుకొనేవాళ్లం. ఏమిటో ఉద్యోగం పేరు చెప్పి ఇక్కడికి వచ్చేశాకా గిన్నిరొట్టెగాని చింత చిగురు చాట్‌గాని మళ్ళి తినడం కుదరలేదు. మళ్ళీ మా వూరు వెళ్ళి మా అమ్మ చేతి గిన్ని రొట్టె, చింత చిగురు చాట్ తినాలని ఉంది. మీరూ వస్తారా?

July 1, 2009

ప్రత్యేక దళిత చట్టాలు చేయాలేమో!

భారత దేశంలో ఇప్పటికే ముస్లింలకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. అలాగే దళితులకు కూడా ప్రత్యేక చట్టలు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. ఉదయాన్నే టీవిలో వార్తలు చూస్తూంటే యంపి జగన్నాధంగారు స్వయంగా బాంక్ మేనేజర్ను యస్సి యస్టీ లకు లోన్లు మంజూరులో జాప్యం చేస్తున్నారని దాడి చేయడం చాల జుగుప్స కలిగించింది. ఒక అధికారిపై ఒక యంపి స్వయంగా దాడి చేయడం అనేది నిజంగా భారత రాజ్యాంగాన్ని, వ్యస్తను అవమాన పరచడమే. ఇది వారి మూర్ఖత్వాన్ని బరితెగించడాన్ని తెలియచేస్తోంది. యస్సి, యస్టిల పేరుమీద ఏమి చేసినా చెల్లుతుందనే వారి నమ్మకానికి ఇది పరాకాష్ట.నేను చూసిన ఆఫీసుల్లో ఈ పద్దతి ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలో ఉంది. నిబంధనలు విధిగా పాటించాలనే అధికారులపై అట్రాసిటీ కేసులు పెట్టడం సర్వసాధారణం. దళితుల రక్షణకు చేసిన చట్టాలు చాలా విధాలుగా దుర్వీనియోగం చేస్తున్నారు. ఆఫీసుల్లో పనిచేయమంటే అట్రాసిటీ కేసులు పెట్టడం, కావలసిన సీటు ఇవ్వకపోతే అట్రాసిటీ కేసు పెడతామనడం ఇవిగాక యస్సి, యస్టీ సంఘాలు ఆఫీసుల్లో చేసే హడవిడి అంతా ఇంతా కాదు. అంబేద్కర్ దేశ నాయకుడు. ఆయనకు వర్గ నాయకత్వం అంటగట్టి ఆఫీసుల్లో వీరు చేసే చేష్టలు ఆయనను అవమాన పరిచేవిగా ఉంటాయి. ఎక్కడో కొన్ని దురదృష్ట సంఘటనలు మినహా వీరు చెపుతున్న విభేదాలు లేనేలేవు. న్యూనతా భావాన్ని వీరు విడిచి పెట్టి మనసులో ఉన్న విభేదాలు మరచిపోవాల్సిన అవసరం ఉంది. అగ్ర వర్నాల దురహంకారం అంటూ ఎలుగెత్తే వీరికి ప్రస్తుతం జగుతున్న ప్రేమ వివాహాల్లో ఎంతమంది యస్సి, యస్టీ వర్గాలకు చెందిన అమ్మాయిలను అబ్బాయిలను ఇతర కులస్తులు చెసుకోవట్లేదు! చట్టాల మాటున వీరు దాడులు చేయడం గర్హినీయం. ఈ ఉపేక్ష ఇలాగే కొనసాగితే కొన్నాళ్ళకు వీరికి ఓటు వేయని వాళ్ళమీద అట్రాసిటీ కేసు, పదవి ఇవ్వకపోతే ప్రధాని మీద ఒక అట్రాసిటీ కేసు పెడతారేమో! కబట్టి ఇకపై వీరు ఎలాంటి దాడి చేసినా శిక్షలు ఉండని విధంగా చట్టాలు చేయాల్సిన అవసరం ఉంది.