January 20, 2010

ఎవరికోసం ఈ త్యాగాలు?




వరంగల్ జిల్లాలో రెండేళ్ళ పిల్లవాడు బోరుబావిలో పడి ప్రాణలకోసం కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఆంధ్రదేశమంతా ప్రార్ధనలు చేసింది, ఆ బిడ్డ ప్రాణాలు కాపాడమని. ఆ బిడ్డ ప్రాణాలు పోయాయని తెలిసినప్పుడు అందరూ ఒక్కలా కన్నిరుమున్నీరై విలపించారు. అది మానవత్వం. కానీ రాష్ట్రాన్ని విభజించండీ అంటూ తనకుమాలిన కోరికలతో ఆత్మత్యాగాలు పేరిట ప్రాణాలు తీసుకుంటున్న యువకులపట్ల అందరూ అలా స్పందిస్తున్నారా? కొంతమందైతే కావచ్చుగానీ ఖచ్చితంగా అందరూ కాదు. వారి ప్రాణాలు కోల్పోయినందుకు బాధపడ్డా ప్రజలు శాపనార్ధాలు పెట్టేది మాత్రం దిక్కుమాలిన రాజకీయనాయకులనే. ఇరవై ఏళ్ళ వయసులొ సమైక్య ఆంధ్రలో వ్యక్తిగతంగా వీళ్ళు పడ్డ కష్టమేమిటో, ప్రత్యేక రాష్ట్రంలో వీరు అనుభవించబోయే భోగ భాగ్యాలేమిటో వీరికి తెలుసా? నువ్వు నష్టపోయావు అంటే కాబోలు అనుకునే ప్రజలున్నంత వరకూ ఈ మృత్యుహేల కొనసాగుతూనే ఉంటుంది. చనిపోయినవాడు చేసినది పిచ్చి పని అని అందరూ ముక్త కంఠంతో ఖండించాల్సింది పోయి, నీది మహోన్నత త్యాగం, నువ్వు అమరుడవు, నీ త్యాగాన్ని తెలంగాణా ప్రజలు మరచిపోలేరు అంటూ మరింతమందిని ఆత్మహత్యలకు పురిగొల్పే వీళ్ళు నాయకులా? వీళ్ళు ఉద్యమకారులా? రాజకీయ జేఏసీలో ఎవరైనా ఒక్కరు ఆత్మాహుతి చేసుకొని తమ అమరత్వాన్ని చాటుకోవచ్చుగా. వాళ్ళ పదవులు వదులుకోవడానికే మల్లగుల్లాలు పడే వీళ్ళు ప్రాణాలు పణంగా పెడతారా?

తెలంగాణా ఉద్యమంలో ఎన్నో దృక్కోణాలు. ఎవరి స్వార్ధం వారిది. ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొనె కోట్లకు పడగలెత్తినవాళ్ళూ లేకపోలేదు. ఓయూ విద్యార్దుల జేఏసీకి అక్షరాలా మూడు కోట్ల రూపాయలు అందాయని సమాచారం. వాటి పంపకంలో విద్యార్ధుల మధ్య ఎన్నో లుకలుకలు నడుస్తున్నాయన్నది మీడియాలో ప్రస్తుత కధనం. కానీ ఎవరికీ బైటపెట్టే దమ్ములేదు. ఇవేమీ తెలియని అమాయక విద్యార్ధులు తమవంతు త్యాగాలను చేస్తునే ఉన్నారు. ఇంతవరకూ పదండి ముందుకు అంటూ జనాన్ని ఎగదోసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి పదవులకు రాజీనామా అనేసరికి, ప్రభుత్వం పడిపొతే (తనకు) తెలంగాణాకు నష్టం అంటూ మరో పల్లవి అందుకున్నారు.

ఏదిఏమైనా అన్నీ సద్దుమణగాలంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి. రెచ్చగొట్టే నాయకులను నోరు మూయించి లోపల వెయ్యాలి. ముఖ్యంగా న్యూస్ చానల్స్‌ను కూడా కొంతకాలం ప్రసారాలు నిలుపు చేయించాలి. ప్రశాంత వాతావరణం ఏర్పడ్డాక ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి సరియైన నిర్నయం తీసుకోవాలి. బహుశా జరుగబోయేది అదే కావచ్చు!!

4 comments:

Sravya V said...

ఇది వరకు దేవుడా పనికి మాలిని మేతావుల నుంచి నా దేశాని కాపాడు అనుకునే దాన్ని ఇప్పుడు ముందు పని పాట లేకుండా జనాల ఉద్రేకాలని రెచ్చగొట్టి తమాషా చూడటానికి లిప్ సర్వీసు చేసే పనికి మాలిన ఉద్యమకారుల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడు అనుకుంటున్నా ఇంతకన్నా ఏమి చేయలేక .
ఎవరన్న తెహల్కా మాదిరి స్టింగ్ ఆపరేషన్ చేసి జనాలకు అసలు నిజాలను చూపిస్తే బాగుండు

నాగప్రసాద్ said...

యాక్!...మీకు దండం పెడతా. ముందు ఆ ఫోటో తీసేయ్యండి. చూడాలంటేనే భయంగా ఉంది. రాత్రికి కల్లోకొచ్చేట్టుగా ఉంది.

పాపం. ప్రత్యేక రాష్ట్రం రాకుంటే, ఉద్యోగాలు రావని, బ్రతకలేరని వాళ్ళని భయపెట్టడం వల్ల, విద్యార్థులు ఇలా చేసుకుంటున్నారు. కాని వారి వల్ల లాభం పొందుతున్న వారి గురించి, వారు ఎప్పటికి తెలుసుకుంటారో.

ఏదేమైనా, అర్జంటుగా రాష్ట్రపతి పాలన విధించాలి.

విశ్వామిత్ర said...

@ శ్రావ్య గారూ

మన చానల్స్ అన్నీ కేసీఅర్‌ను హీరో్‌ను చేసే పనిలో బిజీగా ఉన్నాయి. ఇలాటివి వారి కంటికి కనబడవు.

@ నాగప్రసాద్ గారూ...
ఫొటో మార్చాను. కొన్ని చానల్స్ చనిపోయినవారిని ఇంతకన్న భయంకరంగా చూపిస్తున్నాయి కదండీ! ఇంకా మీరు అలవాటు పడలేదా? :)

నాగప్రసాద్ said...

viswamitra గారు, లేదండి. నేను టీవీ చూడ్డం చాలా చాలా చాలా తక్కువ. అందుకే అలవాటు పడలేకపోయాను. ఏదేమైనా టీవీ చూస్తే మనస్సు ధృఢంగా తయారవుతుందన్నమాట. ఇదో లాభం అయితే. :))