June 9, 2010

మీడియా, జర్నలిస్టులు వేరు వేరుట !!


దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకోవడం అనేది ఒకప్పటి మాట. చానల్స్ చానల్స్ ఊళ్ళు పంచుకోవడం అనేది ఇప్పటి మాట. దొంగల ఆగడాలు కొంతవరకు పోలీసులు అరికడతారు. ప్రభుత్వ ఆగడాలను ప్రతిపక్షాలు అరిచి అడ్డుకుంటాయి. కాని మీడియా ఆగడాలను ఆపడం ఎవరి తరము కాలేదు. కానీ ప్రజల అదృష్టం కొద్దీ వారి ఆగడాలు వారే బైట పెడుతున్నారు. ఆ మధ్య రెండు చానల్స్ ఒకరిపై ఒకరు ప్రత్యక్ష వాదోపవాదనలు చేసుకుంటూ ఒకరు చేసిన ఆగడాలను మరొకరు బైటపెడుతూ మీడియా ముసుగు తొలగించి ప్రజలముందు నగ్నంగా ఆవిష్కరించారు. మీడియా అంటే ప్రజలలో ఉన్న భ్రమలు తొలగేటట్టు చేసారు. కాని ఇలాటి సంఘటనలు కొంతమంది మీడియా మితృలకు బ్లాగు మిత్రులకు కూడా మింగుడు పడలేదు. తరువాత జర్నలిస్టుల మధ్య జరిగిన వాదనలు కూడా దొంగలు దొంగలు ఒకరినొకరు బైటపెట్టుకుంటే ఎలా, ఇది మంచి విధానం కాదు అన్న పద్ధతిలో జరిగాయి. ఇప్పుడు బ్లాగుల్లో మీడియా అంటే ఒకటి కాదన్నట్టు ఉంటున్న వారి వాదనలు ఆశ్చర్యం కలగ చేస్తోంది. జర్నలిజంలో యాజమాన్యం ఒక వర్గముట. వాళ్ళు పెట్టుబడిదారులుట. పేపర్లు నడిపేది డబ్బున్న మారాజులేగానీ ధర్మరాజులు కాదని ఇప్పటివరకు వీరికి తెలియదా? ఒక్కక్క జర్నలిస్టుకు అక్షారాలా ముప్ఫైవేలనుండీ యాభైవేలవరకూ జీతభత్యాలు చెల్లించాలంటే అది డబ్బున్నా మారాజులవల్లే అవుతుంది. ఇక జర్నలిస్టులలో రెండో వర్గం యాజమాన్యం కొమ్ము కాసే వర్గమట. వీరు కూడా అసలైన జర్నలిస్టులు కాదుట. పెట్టుబడి పెట్టే యజమాన్యం తమకనుకూలమైనవారికే పగ్గాలు అప్పచెపుతుందని తెలియని అమాయకులా వీరు? తమను ఎండకడుతూ తమకు వ్యతిరేకంగా పనిచేసే ఏ వ్యక్తినీ ఏ సంస్థా భరించదని వీరికి తెలియదా? మీడియా అనేది ఒక వ్యాపార సంస్థే అని ఎప్పుడో నిర్నయించబడింది. దానికి ప్రత్యేక హోదా అవసరం లేదు. అటువంటప్పుడు ఈ నీతి సూత్రాలెందుకు? ఉద్యోగం కావాలంటే యాజమాన్యం చెప్పింది చేయాలి. అది మీడియా అయినా మరేదైనా ఒక్కటే. జీవితం అంటే ఏమిటో పూర్తిగా తెలియని దశలో ఒకరు తమ బ్లాగుల్లో రాసుకున్న రాతలను గొప్ప స్వేచ్చా భావాలు అంటూ అకాశానికెత్తి పొగిడితే జరిగే మేలు ఏమీ ఉండదు. ఆమెకు మరికొంత నష్టమే తప్ప. వీరు రాసే ప్రతీ రాతల్లోనూ జర్నలిస్టుల తప్పు ఏమి లేదనడం, దానికి బాధ్యత యాజమాన్యానిదో, లేక వారి కొమ్ము కాసే భజనపరులదో అనడం హాస్యాస్పదం. మీరంతా ఒకే తానులో గుడ్డలే అనడంలో ఎవ్వరికీ ఏమాత్రం సందేహం ఉండదు. మనం రాసే రాతలను జనం పూర్తిగా విశ్వశిస్తారు అనుకోవడం కూడా ఒక భ్రమే. అన్యాయం ఎక్కడ జరిగినా ఖండించాలి. దానికి వారు వీరు అనే తారతమ్యాలు ఉండకూడదు. వాళ్ళు జర్నలిస్టులైనా మరెవరైనా. స్వచ్చత అనేది మనుషుల్లో ఉండాలి, అది కేవలం వృత్తిలోనే వస్తుంది అనుకోవడం గొప్ప పొరబాటు. జనం దృష్టిలో మీడియా అంటే మీడియానే. యాజమాన్యం, భజనపరులు, స్వేచ్చాభావాలుగల జర్నలిస్టులు అంటూ ఉండరు. ఇలాటి వర్గాలు అన్ని సంస్థల్లోను ఉంటాయి. కాబట్టి తప్పును తప్పుగా చెప్పాలి, పక్కవారిపైనెట్టి నేను స్వచ్చమైనవాడిని అంటే జనం ఒక్కసారే నమ్ముతారు.

ఇక స్వామీజీల విషయానికి వస్తే ప్రజల నమ్మకాన్ని కొంతమంది స్వాములు సొమ్ము చేసుకుంటున్నారన్నది నిర్వివాదాంశం. కొంత ధర్మ ప్రచారం జరిగినా సంపాదనే వారి లక్ష్యం. వారి సాంపాదనలో రాజకీయ నాయకులు,మీడియా కూడా వాటాలు పొందుతారన్నది కొంత నిజం. నాకు తెలిసి ఒక పెద్ద స్వామిజీ తాను అవతారమెత్తిన కొత్తల్లో ప్రచారం కోసం, కవరేజీకి వెళ్ళిన జర్నలిస్టులకు బంగారపు గొలుసులు, ఉంగారాలు ఇచ్చేవాడని ఒక పెద్దాయన చెప్పేడు. నేను కలిసిన ఒక డబ్బున్న భక్తురాలు (ఆమె లెక్చరర్) తనకు నెల నెలా వచ్చే ఇంటి అద్దెల ఆదాయమంతా తన భర్తకు కూడా తెలియకుండా సదరు స్వామీజీకి పంపుతానని చెప్పారు.ఆదాయా మర్గాలు పెరిగేచోట మీడియా దృష్టి పెట్టడం సహజమే కదా. ఏంతైనా మీడియా స్వామీజీలకంటే పవర్‌ఫుల్ కదా!!



4 comments:

Anonymous said...

బాగా చెప్పారు.

WitReal said...

సూటి గా చెపారు... సుత్తి లేకుండా!

ఇంకో పిచ్చ కామెడీ ఎటంటే, మీకందరికి సమాజం పట్ల బాధ్యత లేదంట!! (ఉన్నా సానా కొంచెమే నంట) ఒక్క జర్నలిస్టుకే మాంచి బాధ్యత వుందంట.

మార్తాండ స్టయిల్లో సెప్పాలంటే:
ఈళ్ళంతా (except ఆ కుర్ర పిల్ల) స్కూల్లలో రామాయణంలో రాముడి డవిలాగులు బట్టీ యేసుకొచ్చారు.. కాని తీర స్టేజ్ మీనకొచ్చేసరికి డ్రామా మారిపొయి మధ్య తరగతి మహా భారతం పొగ్రాం మొదలైపొయింది...కాని మన దంతేవాడ బాచ్ రాముడి డవిలాగులే సెప్పుకుంటా పొతన్నారు.......సదువుకున్న దవిలాగులు బాగా స్టేజ్ మీద సెప్పామని -- అల్లకి మాంచి సాటిస్ఫాక్షనే...చూస్తున్న మనకే కామెడీ

Sravya V said...

మీకు ఒళ్ళు మండిదన్నమాట ఇక్కడొక టపా పడింది : ) బాగా చెప్పారు !

విశ్వామిత్ర said...

@ అనూ గారూ...థాంక్సండీ!!


@ WitReal... జర్నలిస్టులు దేనికీ అతీతులేమీ కాదు. ఇలాటి అహంకారపు పోకడలే మీడియా అంటే అసహ్యం కలిగిస్తోంది. తప్పుచేసినవాళ్ళని వాళ్ళు జర్నలిస్టులు కారు, గ్రహాంతర వాసులు అంటే వినడానికి ప్రజలు చెవిలో ఏమి పెట్టుకుంటారని అనుకుంటారో కదా? నిజంగా కామెడీనే.

@ శ్రావ్య గారూ...ఒళ్ళు మండదా చెప్పండీ? అవకాశముంటే ఆటోవాడినుండీ టాటావారి దాకా అందరూ దోచుకునే వాళ్ళే కదా. ఏ అవలక్షణలు లేనిది ఒక్క జర్నలిస్టులే అంటే ఎలా నమ్మేది? పైగా చెడ్డ యాజమాన్యం, చెడ్డ బాసులు, చెడ్డ స్ట్రింగర్లు తప్ప మిగిలినవాళ్ళది తప్పేమి లేదు అంటే ఇక మిగిలింది ఎవరు?