ప్రస్తుతం తెలంగాణాలో బందుల పర్వం కొనసాగుతోంది. తెలంగాణాపై సష్టమైన ప్రకటన వెలువడేదాకా ఈ పర్వం కొనసా.....గుతుందని నాయక గణం అంటోంది. బందులో ప్రజలు, వ్యాపారవేత్తలు, విద్యాసంస్థలు, ఉద్యోగులు, స్వచ్చందంగా పాల్గొంటున్నారని సదరు నాయకులు చెపుతున్నారు. స్వచ్చందముగ అంటే భయముతో అని అర్ధం చేసుకోవాలిగాబోలు. విద్యాసంస్థలపైనా, చిన్నపిల్లలతోవెడుతున్న స్కూల్ బస్సులపైన కూడా ముష్కరులు కొన్ని రోజులముందే దాడి చేయడంతో విద్యాసంస్థలు మూసివేయక తప్పని పరిస్తితి. అందుకే వారు స్వచ్చందముగా బందులో పాల్గొన్నారు. ఎన్నొ వ్యాపార సంస్థలపైన కూడా దాడిచేసి దోచుకున్న సంఘటనలు కూడా జరిగాయి. అందుకే వారుకూడా స్వచ్చందముగా దుకాణాలు మూసి స్వచ్చందముగా బందులో పాల్గొన్నారు. ఇక ప్రభుత్వముకూడా స్వచ్చందముగా బందులో పాల్గుంటోంది. ఎందుకంటే ఆర్టీసీ నష్టాలు భరించే స్థితిలో లేదు లాభాల మాట దేముడెరుగు, సంస్థ ఆస్తులే హరించిపోతున్నాయి కాబట్టి వారుకూడా స్వచ్చందముగా బందులో పాల్గొన్నట్టే. ఇక రైల్వేలు కూడా తమ రైళ్ళను నిలుపు చేసి తెలంగాణాకు అనుకూలంగా బందులో పాల్గొన్నయని భావించవచ్చు.
కానీ ఇన్ని సంఘటనలు జరుగుతున్నా టీవీ చానల్స్ మూగనోముతో కేవలం స్క్రోలింగ్‌లతో సరిబెట్టుకోవలసిన పరిస్తితి వచ్చింది. పాపం హైకోర్టు వారి మైకు, కెమేరాలను కొంత అదుపులో ఉంచమని ఆదేశించడమే దీనికి కారణం.అంతేకాకుండా వారి ప్రసారాలపై కొంత నిఘా ఉంచమని పోలీసులకు కూడా అదేశాలు ఇచ్చింది. లేకపొతే వారంతా వీరావేశంతో "జజ్జనకరి జనారే" అంటూ చిందులేసేవారు.
ఇన్ని విపరీతాలకి కారణమైన మన పులకేసిగారికి ఈ సందర్భములో ఒక బిరిదునిచ్చి సత్కరించాలని నా కోరిక. దానికి నేను రెండు పేర్లను ఎంపిక చేసాను. మొదటిది "బందుమిత్ర" రెండోది "బందోపాధ్యాయ". వీటిల్లో ఎక్కువ మంది ఎంపిక చేసిన పేరును వారికి బిరుదుగా ప్రదానం చేయవచ్చు.
ఇక తెలంగాణా విషయానికి వస్తే (అమాయక) విద్యార్ధులు, ప్రజలు విభజనవల్ల తమకు ఉద్యోగాలు వస్తాయని తమ బ్రతుకులు మెరుగవుతాయని భావిస్తూ ఉద్యమాలు చేస్తున్నారు. ఓయూలో మెస్‌లు మూసివేసినప్పుడు తమకు భొజన ఏర్పాటు చెయమని విద్యార్ధులు రాజకీయ నాయకులను అడిగారని ఒక బ్లాగులో చదివాను. ఇలాటి సంఘటనలు ఎవరినైనా కదిలిస్తాయి. కానీ ఒక విషయం, ప్రభుత్వ ఉద్యోగాలు ఆంధ్రావారిని పిలిచి ఇచ్చెయ్యలేదు. పోటీ పరీక్షలలో ఎంపికైనవాళ్ళకే ఇచ్చారు. ఒకవేళ తాము మిగిలినవారితో పోటీపడలేమనుకున్నప్పుడు దానికొక పరిష్కార మార్గాన్ని చూడవలసిన అవసరం ఉంది. ప్రజలు నిజంగా తాము వెనుకపడ్డామని భావిస్తున్నప్పుడు కూడా నిజానిజాలు తెలుసుకొని పరిష్కరించవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. ఇరుపక్షాలకు నష్టం లేనివిధంగా సమస్యను పరిష్కరించాలి. వృద్ధ జంబూకాలకు వేదికగా మారిన జేయేసీ దృష్టి రాబోయే పదవులపైనే ఉంది అన్నది సుస్పష్టం. కూర్చుంటే లేవలేని ఒక నాయకుడు అయితే గియితే వచ్చే తెలంగాణాకు ముఖ్యమంత్రి పదవి తనకు ఇస్తామని ఎవరో మాటిచ్చారట ఆయన తిరస్కరించారుట. వీరి మాటల్లో ప్రజాభావాలకన్న పార్టీ భావాలే వ్నిపిస్తున్నాయి. రాజకీయ నాయకుల ప్రాతినిద్యం లేని నిజమైన ప్రజాప్రముఖులను కూర్చొబెట్టి సమస్యను పరిష్కరించగలిగితే బాగుండును. కానీ అలా జరగడానికి అవకాశం ఉందా?