September 18, 2009

యత్‌భావం తత్‌భవతి!!

ఏమిటో ఈ మధ్య బ్లాగ్లోకం వైపు చూడటానికి అస్సలు వీలు పడలేదు. ప్రయారిటీలు మరేయేమో అనుకునేరు, కేవలం పని వత్తిడే. మధ్య మధ్యలో ఒక చూపు మాత్రం ఇటువైపు వేస్తునే ఉన్నాననుకోండి.గడిచిపోయిన విషయాలు తలుచుకుంటే బాధ కలిగించే సంఘటన మాత్రం రాజశేఖర రెడ్డి మరణం. ఇటు రాష్ట్రాన్ని అటు కాంగ్రెస్ పార్టీని కూడా ప్రభావితం చేయగలిగిన సత్తా సంపాదించిన ఏకైక నాయకుడు రాజశేఖర రెడ్డి. అతడు మరికొంత కాలం బ్రతికి ఉంటే రాష్ట్ర రాజకీయ సమీకరణాలు చాలా మారి ఉండేవి. కాంగ్రెస్ అధీష్టానాన్ని ఒక రకంగా అచేతనం చేసి రాష్ట్రాన్ని పూర్తిగా తన చెప్పు చేతుల్లోకి తెచ్చుకున్న ఏకైక వ్యక్తి. రాష్ట్రంలో కాంగ్రెస్ అంటే రాజశేఖర రెడ్డి మాత్రమే అనిపించే స్థాయికి తీసుకు వచ్చాడు. ఇప్పటివరకు ఎందరో ముఖ్యమంత్రులు కాంగ్రెస్ హయాంలో పదవులు నిర్వహించారు. అందరూ అధీష్టానికి అనుగుణంగానే నిర్నయాలు చేసేవారు. కానీ రాజశేఖర రెడ్డి మాత్రం తన నిర్ణయాలకు అనుగుణంగా అధీష్టానాన్ని నడిపించాడు. ఎదైనా ఆయన మరణం ఒక దురదృష్టకర సంఘటన. కానీ తదనంతర సంఘటనలు మాత్రం కడుపులో దేవినట్టు చేసాయి. జగన్ తన తండ్రి కడసారి యాత్రలో పెట్టుడు దణ్ణాలు కేవలం సానుభూతి కోసమే. ఎత్తిన చెయ్యి దాదాపు రెండు రోజుల తరువాత దింపాడు. దీనికి పూర్తి స్క్రీన్‌ప్లే కె వి రామచంద్ర రావు. ఆయన ప్రయత్నాలు వైఎస్సార్ చనిపోయిన వెనువెంఠనే ప్రారంభమయ్యాయి. ఎక్కడ పట్టు వదిలితే విహెచ్, జైపాల్ రెడ్డి, డీఎస్ లు ముందు వరుసకు వచ్చేస్తారోనని ఆయన భయం.ఈ విషయంలో మీడియా కూడా చాలా అతి చేసింది. ఈ ప్రభావం వల్ల నూట అరవై మంది మృతి చెందారు.ఇలాటి సంఘటనలు జరిగినప్పుడు ప్రజలు భావొద్వేగానికి గురి కావడం చాలా సహజం. ఆ ప్రభావాన్ని మీడియా తగ్గించే ప్రయత్నం చేసే బదులు చనిపోయిన వారి వేళ్ళు చూపించి కాళ్ళు చూపించి మరింత పెంచింది. వంశ పార పర్యంగా ముఖ్యమంత్రి పదవులు ఇవ్వడం కాంగ్రెస్ అధీష్టానానికి సుతారమూ ఇష్టం లేదు. జగన్‌కి అంత సీన్ ఉందా అన్నది కూడా ప్రశ్న. రోశయ్యకు అందరిని కలుపుకు వెళ్ళేంత శక్తి ఉందా అన్నది కూడా అనుమానమే. కేవలం వైయస్సార్ వల్ల పార్టీలో ప్రాపకం పెరిగింది. ప్రస్తుతానికి ఒక పెద్ద దిక్కు. అధీష్టానం ఒక నిర్నయం తీసుకొనేదాకానే ఈ శాంతి సంప్రదింపులు. తరువాత కధ షరా మామూలే. కాంగ్రెస్ చరిత్రే దీనికి ఉదాహరణ. ఇది నా అభిప్రాయం మాత్రమే. మరి మీరేమంటారో?