January 25, 2010

తలలు బోడులైన తలపులు బోడులౌనా?


తెలంగాణా ఉద్యమంలో ఒకవ్యక్తి ముగ్గుబుట్టలంటి జుట్టుతో వేదికలను అలంకరిస్తూ ఉండేవారు. నెమ్మదిగా ఏకు మేకైనట్టు, తొండ ఊసరవెల్లిగా మారినట్లుగా ఆయన తన స్వరూపాన్ని మర్చుకుంటూ ఒక కరడుగట్టిన రాజకీయవేత్తగా మారుతూ కాకలు తీరిన రాజకీయవేత్తలనే హెచ్చరించే స్థాయికి చేరాడు. ఆయన మరెవ్వరో కాదు కోదండరాం. ప్రొఫెసర్ కోదండరాం. మేధావిగా తెలంగాణా ఉద్యమంలో అడుగుపెట్టి రాజకీయ జేఏసీలో కన్వీనర్ స్థానాన్ని ఆక్రమించిన ఈయన తాను ఒక ప్రభుత్వ ఉద్యోగి అని మరచిపోయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాప్రతినిధులను విమర్శిస్తూ వారిని రాజీనామాలను సమర్పించాలని డిమాండ్ చేయడమే కాకుండా ఈయన కోరే గొంతెమ్మ కోరికలు, వ్యాఖ్యానాలూ కూడా ఏ రాజకీయవేత్త చేయలేడు. గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ తెలంగాణా విద్యార్దుల పరీక్షా పత్రాలు మార్కుల కొలమానానికి ఆంధ్రా ఉపాధ్యాయులకు పంపకూడదని వీరి మొదటి కోరిక. ఆవిధంగా పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిని అపవిత్రం చేయాలనుకున్న సదరు ఈ వ్యక్తి ఒక రాజకీయ జేఏసికి కన్వీనర్ ఎలా కాగలిగాడో? తెలంగాణా పౌరుడిగా ఆయన తన అభిప్రాయాన్ని చెప్పడంలో తప్పులేదుగానీ ఒక రాజకీయ కూటమికి కన్వీనర్‌గా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండడానికి వీలులేదు. పైగా అతడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మద్దతును కూడగడుతున్నదుకు ఆయనను సత్వరమే సస్పెండ్ చేసి ప్రభుత్వ వ్యతిరేక కుట్రలు పన్నుతున్నందుకు ఆయనను ప్రాసిక్యూట్ చేయాలి. ఈయననే కాదు, ప్రభుత్వ జీత భత్యాలు తీసుకుంటూ ఉద్యమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరినీ సస్పెండ్ చేయాలి. గత కొంతకాలం క్రితం తమిళనాడులో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకే రాజపత్రంతో రెండు లక్షలమంది ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ చేసిన సంఘటనను న్యాయస్థానం కూడా సమర్ధించింది. ప్రభుత్వం చూపుతున్న ఈ ఉదాసీనతను చేతగానితనంగా భావిస్తున్న అందరినీ ఒక దారికి తీసుకురావలసిన భాద్యత ప్రభుత్వానిదే.


January 20, 2010

ఎవరికోసం ఈ త్యాగాలు?
వరంగల్ జిల్లాలో రెండేళ్ళ పిల్లవాడు బోరుబావిలో పడి ప్రాణలకోసం కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఆంధ్రదేశమంతా ప్రార్ధనలు చేసింది, ఆ బిడ్డ ప్రాణాలు కాపాడమని. ఆ బిడ్డ ప్రాణాలు పోయాయని తెలిసినప్పుడు అందరూ ఒక్కలా కన్నిరుమున్నీరై విలపించారు. అది మానవత్వం. కానీ రాష్ట్రాన్ని విభజించండీ అంటూ తనకుమాలిన కోరికలతో ఆత్మత్యాగాలు పేరిట ప్రాణాలు తీసుకుంటున్న యువకులపట్ల అందరూ అలా స్పందిస్తున్నారా? కొంతమందైతే కావచ్చుగానీ ఖచ్చితంగా అందరూ కాదు. వారి ప్రాణాలు కోల్పోయినందుకు బాధపడ్డా ప్రజలు శాపనార్ధాలు పెట్టేది మాత్రం దిక్కుమాలిన రాజకీయనాయకులనే. ఇరవై ఏళ్ళ వయసులొ సమైక్య ఆంధ్రలో వ్యక్తిగతంగా వీళ్ళు పడ్డ కష్టమేమిటో, ప్రత్యేక రాష్ట్రంలో వీరు అనుభవించబోయే భోగ భాగ్యాలేమిటో వీరికి తెలుసా? నువ్వు నష్టపోయావు అంటే కాబోలు అనుకునే ప్రజలున్నంత వరకూ ఈ మృత్యుహేల కొనసాగుతూనే ఉంటుంది. చనిపోయినవాడు చేసినది పిచ్చి పని అని అందరూ ముక్త కంఠంతో ఖండించాల్సింది పోయి, నీది మహోన్నత త్యాగం, నువ్వు అమరుడవు, నీ త్యాగాన్ని తెలంగాణా ప్రజలు మరచిపోలేరు అంటూ మరింతమందిని ఆత్మహత్యలకు పురిగొల్పే వీళ్ళు నాయకులా? వీళ్ళు ఉద్యమకారులా? రాజకీయ జేఏసీలో ఎవరైనా ఒక్కరు ఆత్మాహుతి చేసుకొని తమ అమరత్వాన్ని చాటుకోవచ్చుగా. వాళ్ళ పదవులు వదులుకోవడానికే మల్లగుల్లాలు పడే వీళ్ళు ప్రాణాలు పణంగా పెడతారా?

తెలంగాణా ఉద్యమంలో ఎన్నో దృక్కోణాలు. ఎవరి స్వార్ధం వారిది. ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొనె కోట్లకు పడగలెత్తినవాళ్ళూ లేకపోలేదు. ఓయూ విద్యార్దుల జేఏసీకి అక్షరాలా మూడు కోట్ల రూపాయలు అందాయని సమాచారం. వాటి పంపకంలో విద్యార్ధుల మధ్య ఎన్నో లుకలుకలు నడుస్తున్నాయన్నది మీడియాలో ప్రస్తుత కధనం. కానీ ఎవరికీ బైటపెట్టే దమ్ములేదు. ఇవేమీ తెలియని అమాయక విద్యార్ధులు తమవంతు త్యాగాలను చేస్తునే ఉన్నారు. ఇంతవరకూ పదండి ముందుకు అంటూ జనాన్ని ఎగదోసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి పదవులకు రాజీనామా అనేసరికి, ప్రభుత్వం పడిపొతే (తనకు) తెలంగాణాకు నష్టం అంటూ మరో పల్లవి అందుకున్నారు.

ఏదిఏమైనా అన్నీ సద్దుమణగాలంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి. రెచ్చగొట్టే నాయకులను నోరు మూయించి లోపల వెయ్యాలి. ముఖ్యంగా న్యూస్ చానల్స్‌ను కూడా కొంతకాలం ప్రసారాలు నిలుపు చేయించాలి. ప్రశాంత వాతావరణం ఏర్పడ్డాక ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి సరియైన నిర్నయం తీసుకోవాలి. బహుశా జరుగబోయేది అదే కావచ్చు!!

January 18, 2010

రంపపు కోతలాంటి రాతలెందుకో?
బ్లాగుల్లో కొన్ని టపాలు చదువుతూ ఉంటే చిన్న చిరునవ్వు అలా మెరిసి చటుక్కున మాయమౌతుంది. అలా అనిపిస్తే ఆ టపాకు ఒక సార్ధకత చేకూరినట్టే. టపా బాగున్నప్పుడు కామెంటడానికి బాగుంది అని చెప్పడం రోటీన్ అనిపించినప్పుడు నేనైతే చిన్న చిరునవ్వు :) వదిలిపెడతాను. నేను చదివాను మీ టపా నాకు నచ్చింది అని చెప్పడానికి. కానీ కొన్ని బ్లాగరుల రూటే వేరు. వారు ఏది చేసినా ఒక సంచలనం కోరుకుంటారు. అది వ్యతిరేకతతో కూడినదైనా సరే. వారి రాతలలో ఎన్నో నికృష్ట భావాలు కనబడుతూ ఉంటాయి. మనుషులలో నిబద్దత వీరికి నచ్చదు, సమాజమంటే ఏవగింపు, మనుషులపై అకారణ ద్వేషం వీరి రాతల్లో కనబడతాయి. సమాజంలో ఒక్క మంచి సంఘటన కూడా వీరి కంటికి కనబడదు. పదిమంది మెచ్చినది వీరు మెచ్చరు. పదిమంది చీ అంటే వీరు అద్భుతం అంటారు. అదేమి మిత్రమా అని అడిగితే కొన్ని పడికట్టుపదాలతో వీరు అర్ధం కాని భావాలెన్నొ చెప్పగలరు. పైగా ఇది నా బ్లాగు, నా ఇష్టం అంటారు. మరింత ముదిరితే మిమ్మలని నా భావాలతో ఏకీభవించమని నేను అడగలేదు, అసలు నా బ్లాగు చూడమని కూడా చెప్పలేదు అంటారు. కొన్ని టపాలు చదివినప్పుడు కొందరికి కలిగే భావాలు ఎలా ఉంటాయొ చిన్న ఉదాహరణ ఇస్తున్నాను.

"అయితే మీ శ్రేయోభిలాషిగా మీకోమాట చెబుదామనుకుంటున్నాను. లౌకికవాది అనే ముసుగు వేసుకున్నాను గదా నేనేంటో అసలెవరికీ తెలియదులే అని మీరు ఇంకా అనుకుంటూనే ఉన్నారు గదా! కాని అది తప్పు సార్.. ఆ ముసుగు చాలా పల్చగా ఉంది. ముసుగులోంచి మీ వంటిమీది చారలు స్పష్టంగా కనబడిపోతున్నాయి. క్రూరమైన కోరలు (కరాళ దంష్ట్రలవి :) ) నోట్లోంచి కారుతున్న చొంగా కనిపిస్తూనే ఉన్నాయి. అసహనం కారణంగా మీ గొంతులోంచి వచ్చే గురక వినిపిస్తూనే ఉంది. ఇక దాచలేరు సార్, ఆ ముసుగు తీసెయ్యండి. అసలు రూపును బయటపెట్టండి"

మనం రాసిన రాతలకు అవతలివారికి ఎంత ఒళ్ళు మండితే ఇలాటి కామెంట్లు వస్తాయి చెప్పండి. మన టపా చదివిన అందరికీ నచ్చాలని లేదు కానీ, చాలా మంది అసహనాన్ని వెళ్ళగక్కితే దానిలో కొంత లోపమున్నట్టే. మీరేమంటారో?

January 15, 2010

యార్లగడ్డ "ద్రౌపది" నవలపై బ్లాగుల్లో రాతలు....కామెంట్లు ....


హిందూ సంస్కృతి పరిరక్షణకు నేనేమి నడుము కట్టుకోలేదు. కానీ కొందరు హిందూ సాంప్రదాయాలపై దాడి అంటే మాత్రం ముందు వరుసలో నిలుస్తారు. అలాటివారిలో మన బ్లాగరు కత్తి మహేష్ కుమార్ గారు ఒకరు . యార్లగడ్డ రాసిన పుస్తకాన్ని వీరు చదువలేదు. అయినా ఆపుస్తకంపై ఒక టపా రాస్తూ ఆపుస్తకాన్ని విమర్శించిన వ్యక్తులపై వీరు విమర్శల వర్షం కురిపించారు. ఎందుకంటే ఆ పుస్తకంలో విమర్శకుల విమర్శలప్రకారం హిందూ సాంప్రదాయలపై దాడి జరిగిందికాబట్టి అది ఎలాటిదాడో తెలియకపోయినా అది వీరికి ఇష్టంకాబట్టి ఆ దాడిని వీరు సమర్ధిస్తారు. మహాభారతం యదార్ధమో కాదోనన్న విషయం పక్కనబెడితే ఆ కధలో ద్రౌపదికి ఐదుగు భర్తలున్న స్త్రీ అయినా ఒక ఉత్తమ స్త్రీగా చిత్రికరిస్తూ స్త్రీయెడల ఉన్నత భావాలు కలిగించారు. అయిదుగు భర్తలు గలిగిన స్త్రీ అంటే మిగిలిన విషయాలు విడమరచి చెప్పవలసిన అగత్యం లేదు. కానీ సోమవారం ఒకరితో సుఖించినది, మంగళవారం ఒకరితో సుఖించినది బుధవారమం మరొకరితో సుఖించినది అని చెప్పడంలోనే రచయిత ఉద్దేశ్యం బయట పడుతుంది. కొంతమందికి కొన్ని సమయాలలో కీర్తికోసం వెంపర్లాట మొదలౌతుంది. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు పండితులు వారికి అన్ని గ్రంధాలు కరతలామలకం. కానీ ఎంతటివారైనా కొన్ని క్షణాలలో కీర్తి ప్రతిష్టలు కోరుకొవడం మానవ లక్షణం. కానీ ఆ పుస్తకం చదవకపోయినా మహేష్ గారి అత్యుత్సాహం కూడా ఇలాటిదే. ఆ పుస్తకాన్ని నేను చదవలేదు. తెలుగు సాహిత్యానికి గుర్తింపు రాలేదేనని మహేష్ బాధ పడుతున్నారుట. పురాణా ఇతిహాసాలని అపహాస్యం చేస్తూ కీర్తిని గడించాలని కోరుకోవడం సరియైనదేనా? ఆ బ్లాగులో వచ్చిన కామెంట్లు కూడా ఆశ్చర్యం కలిగించాయి. ద్రౌపదికి అయిదుగురు భర్తలను ఎలా కట్టబెట్టారు అని రచయిత అడిగిఉంటే బాగుండేదిగానీ అయిదుగురితో ఎలా సుఖించినదో తెలియచేయడంలోని ఔచిత్యం ఏమిటో మహేష్ రచయిత తరపున తెలియచేస్తారా?


ఏది సంస్కృతో చెప్పి మాకళ్ళు తెరిపించండి !!


బ్లాగుల్లో సంక్రాంతి సంబరాలగురించి కొంతమంది చక్కగా చెప్పారు. పదిమందీ కలిసి చేసుకొనే పండుగల్లో సంక్రాంతి ఒకటి. రైతులకు పంట చేతికొచ్చాక ఇంటిల్లిపాదీ ఆనందంగా గడుపుకొనే సంతోషకరమైన రోజులు. వాటిని మరింత శోభాయమానంగా చేసుకోవడానికి ఇంటికి కొత్త సున్నాలు, ఇంటిముందు ముగ్గులు, గొబ్బెమ్మలు, భొగి మంటలు ఒక అదనపు ఆకర్షణలు. రైతులు అహ్లాదకరంగా గడపడానికి కోళ్ళ పందేలు. ఆంధ్ర దేశంలో ఎంతోమంది ఎన్నో దశాబ్దాలుగా చేసుకుంటున్న పండుగ. ఇదా సంస్కృతి అంటూ కొంతమంది వెక్కిరించడానికి నాకేమి కారణాలు కనబడడటం లేదు. సంస్కృతి అంటే ఏమిటో? అందరూ ఒక విధానాన్ని సంవత్సరాలుగా చేస్తూపొతే తరువాతి కాలంలో అదే సంస్కృతి అవుతుందని నా మట్టి బుర్రకు తోచింది. మరి ఇంతకుమించి సంస్కృతి అంటే ఏమొటో వెక్కిరించేవాళ్ళు చెపితే మా కళ్ళు తెరుచుకుంటాయి. హిందూ సంస్కృతి అంటే కొంతమందికి చులకన బావన ఎందుకో అర్ధం కాదు. ఆ వెక్కింతను సహేతుకంగా వివరిస్తే కొంత తెలుసుకొనే ప్రయత్నమైనా చేస్తాము. ముగ్గులూ, గొబ్బెమ్మలూ,భోగిమంటలూ, గంగిరెద్దులూ సంస్కృతా అంటే? అది కాకపోవచ్చు అనిపిస్తే మరేదో చెప్పాలి. కేవలం ఒక ప్రశ్నను వేసి గేలి చేయడం సరికాదేమో! ముఖ్యంగా ఇటువంటి టపాలు ఆకతాయీలు రాస్తే అస్సలు పట్టించుకోనక్కర్లేదు. కానీ అన్నీ తెలిసినవాళ్ళే ఆకతాయీల్లా రాస్తున్నప్పుడు స్పందించక తప్పదు. వారి రాతలను మరింత సహేతుకంగా రాయాలిగానీ, కేవలం ఇదా సంస్కృతి అని ప్రశ్నించి వదిలివేయడం మంచిది కాదు.

January 13, 2010

కేసీఅర్ మౌనానికి కారణం?


కేసీఅర్ పేపర్‌లోగానీ చానల్స్‌లో గానీ మాట్లాడి పదిరోజులు కావస్తోంది. ఆయన మాండలికాలు, హెచ్చరికలు లేక పత్రికలు బోసిపోతున్నాయి. విలేకరులు నీరసపడిపోతున్నారు. ఆయన కనీసం కేమేరాలవంకైనా చూడటంలేదు. విలేకరులతో పెదవి విప్పి మాటైనా మాట్లాడటం లేదు. ఈ మౌనానికి కారణం ఏమిటో మరి? ఢిల్లీలో పార్టీల మీటింగు అయినతరువాత వ్యూహాత్మక మౌనం అని పేపర్లు అన్నాయి. కేంద్రం తన నిర్నయాన్ని ప్రకటించిన తరువాత ప్రతిస్పందిస్తామని టీఅరెస్ ప్రకటించింది. కేంద్రం కేవలం శాంతి మంత్రం తప్ప మరో మాట లేదు. తెలంగాణా జేఏసీ మీటింగు కూడా పెట్టుకుంది. అది అయినతరువాత కూడా కేసీఅర్ మాట లేదు. మరోపక్క తెలంగాణా జేఏసీ మరోమారు ఉద్యమానికి సంసిద్ధమౌతోంది. ఇన్ని జరుగుతున్నా కేసీఅర్ ప్రేక్షకుడిగానే ఉన్నారుగానీ పెదవి విప్పలేదు.

ఇది ఇలా ఉండగా మీడియాలో అనధికార వార్తల ప్రకారం గృహమంత్రి చిదంబరంగారు రాష్ట్రంలోని కొంతమంది నాయకుల సంపాదనలపైనా వారి బినామీ లావదేవీలపైనా ఒక నివేదికని సిద్ధం చేయించారని వినికిడి. దానిపై జాతీయ రక్షణ చట్టంకింద కేంద్రం తగు చర్యలు తీసుకునే అవకాశాలను తోసిపుచ్చలేమని ఈ సందర్భంలో చెప్పారట. మరి ఢిల్లీలో పార్టీల సమావేశం అయినతరువాత అందరూ శాంతి మంత్రం జపించిడంవెనుక మర్మం ఇదేనా? మరి ఇది కాకపొతే ఆ చిదంబర రహస్యమేమిటో?

గమనిక: ఈ వార్తని పట్టుకొని ఏదైనా చానల్ మరో చర్చా కార్యక్రమం చేపడితే జరిగే పరిణామాలకు ఈ బ్లాగు బాధ్యత వహించదని చానల్స్‌కు తెలియచేస్తున్నాము. :)

January 9, 2010

ఏ'కాకిలా టీవీ-5'చానల్మనం అనుకున్నట్టుగానే టీవీ-5 లో అరెస్టులను పత్రికా స్వేచ్చపై దాడి అని, కలానికి సంకెళ్ళు అంటూ కొందరు ఆక్రోసిస్తున్నారు. కానీ ఇక్కడ దాడి చేసింది టీవీ-5 నా లేక ప్రభుత్వమా? ఉల్టా చోర్ కొత్వాల్‌కొ మారా" అన్నట్టుగా పోలీసులు టీవీ-5 పై దాడిచేయడంగా వర్నించడం వారి గడుచుదనానికి పరాకాష్ట. ప్రజలని (ప్రస్తుతం జర్నలిస్టులని)రెచ్చగొట్టడం లో చానల్స్ చాలా నేర్పును గడించాయి. మరి మీ తదుపరి కార్యక్రమం ఏమిటి అంటూ ప్రతీ వాళ్ళని శాయ శక్తులా రోడ్డుమీదకి లాగ చూస్తున్నారు. జర్నలిస్టులకు ప్రభుత్వం గానీ నాయకులు గానీ ఎప్పుడూ పెద్దపీట వేస్తారు. కానీ గత కొంతకాలంగా వారి మితిమీరిన చేష్టలు ప్రతీవారిని విసిగించాయి. దీనికి ఉదాహరణ రోశయ్య గారిని జర్నలిస్టులు రాత్రి కలవడానికి వెడితే ఉదయం ఆఫీసులో వచ్చి కలవండి అని చెప్పారుట. జర్నిస్టులనుండీ వచ్చే కోరికలని సాధ్యమైనంత వరకూ తీర్చడం ఏలినవార్లకు పరిపాటే అయినా వారిని కలవడానికిగానీ వారికి సంఘీభావాన్ని గానీ తెలిపే నాయకులే కరువయ్యారు. మేధావుల ప్రజల మద్దతును కూడా వారు కోల్పోయారు. ఈనాడు ఏకాకాకిగా మిగలడానికి కారణం వారి స్వయంకృతమే. కానీ కార్యక్రమ నిర్వాహకులతోబాటు యాజమాన్యాన్ని కూడా దీనికి బాధ్యుల్ని చేయాలి. వారికి కూడా ఈ పాపంలో భాగం ఉంది. టీవీ-5 లో జరిగే చర్చాకార్యక్రమంలో ఎవరో తెలియని మేధావులు పాల్గొంటున్నారు. ఒక మేధావి రష్యా నుండీ వెలువడే వెబ్‌సైట్‌లో రిలయన్స్ అధినేత పేరు ఉందిగాబట్టి సుమోటాగా తీసుకొని వారిపై కేసుపెట్టాలి్‌గానీ టీవీ-5 పై కేసుపెట్టడం అన్యాయం అంటూ చెప్పుకొచ్చాడు. ఇలాంటి భజనపరులను చేర్చుకొని మద్దతును కూడగట్టుకోవడం కన్నా చేసిన తప్పును ఒప్పుకొని ఇలాటి పొరపాట్లు చేయమని ఒప్పుకొని బైటపడితే వారికి మంచిది. ఇంత గొడవ జరుగుతున్నా మిగిలిన న్యూస్ చానల్స్ చక్కగా పాటలు, వంటలు ప్రసారం చేసుకుంటున్నాయి.టీవీ-5 కూడా వారి వాణిజ్య ప్రకటనలు యదాతధంగా ప్రసారం చేసుకొంటోంది. అంతా మీడియా మయం. ఉష్!!


January 8, 2010

చానల్స్‌పై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం


ప్రభుత్వం చానల్స్ యొక్క విశృంఖలత్వం మీద బాణం ఎక్కుపెట్టింది. టీవీ-5 ఎగ్జిగ్యుటివ్ ఎడిటర్ బ్రమ్మానంద రెడ్డి, ఇన్‌పుట్ ఎడిటర్ వెంకట కృష్ణలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టుల పర్వం సాగుతున్నప్పుడు సిబ్బంది అడ్డుకున్నా పోలీసులు వారిని తీసుకెళ్ళారు. అరెస్టులు జరుగబోతున్నాయని వారికి ఉదయమే తెలుసు. వారికి దన్నుగా జర్నలిస్టుల సంఘాలు తమ సంఘీభావాన్ని తెలుపుతూనే ఉన్నాయి. తమ బాధ లోక బాధగా జర్నలిస్టుల ఆక్రోశాలు మొదలౌతాయి. వారి అరెస్టులు పత్రికా స్వేచ్చపై దాడిగా అభివర్ణించడం, పత్రికల నోరు ప్రభుతం నొక్కేస్తోందని వాపోవడం, కలానికి సంకెళ్ళు, ఫోర్త్ ఎస్టేట్ కూల్చివేత అంటూ రేపు పేపర్లో రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. వారి చివరి బెదిరింపు ప్రభుత్వ కార్యక్రమాల కవరేజ్ బహిష్కరణ. మంత్రులు, ముఖ్యమంత్రులు నిర్వహించే కార్యక్రమాలను బహిష్కరిస్తూ వారి నిరసన తెలియచేయవచ్చు. వారిపై వ్యక్తిగత దాడులను హర్షించకపోయినా వారి విశృంఖల ప్రసారాలను ప్రజలు భరించే స్థితిలో లేరన్నది నిజం. స్వీయ నియంత్రణతో ప్రజామోదమైన కార్యక్రమాలు చేయాలని ముక్త కంఠంతో ప్రజలంతా కోరుకుంటున్నారని ఇప్పటికైనా వారు తెలుసుకుంటే అందరికీ మంచిది.

ఇది జర్నలిజమా?..వీళ్ళు జర్నలిస్టులా?...సిగ్గు సిగ్గు..!!


రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలని న్యూస్ చానల్స్ కంకణం కట్టుకున్నాయా? అవుననే అనిపిస్తోంది. నిన్నటివరకు తెలంగాణా విషయంలో అగ్గి రాజేసి న్యూస్ కాచుకున్న చానల్ ఇప్పుడు ప్రజలపై మరోలా విరుచుకుపడింది. ప్రజా నాయకుడు వైయెస్సార్ హత్య చేయబడ్డారంటూ ఒక కధనాన్ని ప్రజల్లోకి వదిలింది. పధకాన్ని పన్నింది రిలయన్స్ అధినేతా అంటూ ఒక ప్రశ్నతో కూడిన సమాధాన్ని వదిలింది. దాని పరిణామం రిలయన్స్ ఆస్థులపై దాడులు, లక్షలలో ఆస్థి నష్టం. ఎక్కడో పనికిమాలిన రాతలను పట్టుకొని ఇటువంటి కధనాలు అల్లడం, అది నిజమా అంటూ ప్రజలను ప్రశ్నించడం, ఇది జర్నలిజమా? వీళ్ళు జర్నలిస్టులా? ఒకప్పుడు డిటెక్టివ్ సాహిత్యమనేది ఉండేది. అలాగే బూతు సాహిత్యం కూడా. వీటిని చదివేవాళ్ళని అందరూ అసహ్యయించుకునేవాళ్ళు. ఇవి కిళ్ళీ బడ్డీలలో ఎవ్వరికీ కనిపించకుండా కేవలం ప్రత్యేకంగా అడిగినవారికే ఇచ్చేవారు. ఆ రాతలు రాసే రచయితలందరూ ఈరోజు జర్నలిస్టులు అయ్యారేమో అనిపిస్తోంది. కేవలం టీఆర్పీ రేటింగులకోసం వీరు ఎంత గడ్డికరవడానికైనా తెగిస్తారని తెలుస్తోంది. ఒక చానల్ గవర్నర్ కధనాన్ని ప్రసారం చేసి ముందువరుసలోకి వచ్చేసిందెమోనని తాము కూడా ఒక సెన్సేషన్ సృష్టించాలని కంకణం కట్టుకొని చేసే పనులు. వీటి ప్రభావం ప్రజలపైన ఎలా ఉంటుంది అనే ఇంగిత జ్గ్నానం కూడా లేకుండా తదుపరి పరిణామాలు ఊహించకుండా, భాద్యతా రహితంగా చానల్స్ ఎలా ప్రవర్తిస్తున్నాయో ఇది ఒక ఉదాహరణ. పైగా వీరి నింద దేశ ఆర్ధిక వ్యవస్థలో పునాదిలాంటి వ్యక్తి. వేలకోట్ల పెట్టుబడులతో లక్షలమందికి జీవనోపాధి కల్పిస్తున్న సంస్థలకు అధిపతి. అటువటి సంస్థలు ఒక్కసారి మూతబడితే వారిపై ఆధారపడ్డవారి సంగతి? అలాటి కధనం నిజమైనా కూడా ఎంత భాద్యతతో మెలగాలి? పైగా వైయెస్సర్ బంధువులను ఫోన్‌లో పిలిచి ఈ విష్యంపై మీరేమి చేబోతున్నరని రెచ్చగొట్టే ప్రశ్నలు. వీరు చెప్పిన కధనం నిజమో కాదో వీరికే తెలియదు, కాని వీరి కధనంపై ప్రజలు వెంఠనే ఏదొవిధంగా ప్రతిస్పందించాలి. అది చూసి వీళ్ళు సంతోషపడాలి. రిలయన్స్ అధినేతలు, రాష్ట్ర ప్రభుత్వం కూడా వీరిపై కేసులు పెట్టబోతున్నాయి. కేసులు పెట్టాలి. వీరిని కోర్టులో నిలబెట్టాలి. గాలి వార్తలు, నీలి వార్తలు ప్రసారం చేసేవాళ్ళకి బుద్ధి వచ్చేలా శిక్షించాలి.

January 6, 2010

జే.పీ పిచ్చ పిచ్చగా నచ్చేశాడు....!!


మొత్తం మీద అనుకున్నట్టుగానే అయింది. ఏదొ జరిగిపోతుందని పేపరోళ్ళు, చానల్స్ జనాన్ని ఎంతో సస్పెన్స్‌లో ఉంచి టీఆర్పీ రేటింగ్ పెంచుకున్నాయి. ఏనుగు పిత్తితే ప్రళయం వచ్చేస్తుందని పారిపోబోతే తుస్సుమన్నదట. అలాగుంది ఢిల్లీ మీటింగ్. మీటింగులో నిర్నయించినది మళ్ళీ మళ్ళీ కలవాలని. అదీ సంగతి. తెలంగాణా ప్రస్తావనే లేకుండా టీచర్ పిల్లలని అడిగినట్టు అడిగి వారు చెప్పింది విని సరే వెళ్ళండి అన్నారు. కానీ చిదంబరం ఏమి మంత్రం వేశారోగానీ రాష్ట్రంలో మాత్రం సత్వరమే శాంతి నెలకొనాలని అందరిచేతా ఒక ప్రఖటన చేయించారు. మీటింగ్ అయినతరువాత సదరు నాయకులు చెప్పిన విషయాలు నలుగురు గుడ్డివాళ్ళు ఏనుగును గురించి వర్నించినట్లు పొంతన లేకుండా చెప్పారు. చిరంజీవి మంచి వాతావరణంలో మీటింగ్ జరిగిందని చెపితే, కాంగ్రెస్ నాయకులు (సమైక్య ఆంధ్రా) పెదవి విరవగా టీఆరెస్ నాయకులు ఇది మొదటి అడుగు అంటూ చెప్పుకొచ్చారు. కానీ మీటింగ్ అయ్యాకా ప్రణబ్ చెప్పిన మాటల "తెలంగాణా ఏర్పాటు అంత సులువు కాదు, అది ఇప్పటికిప్పుడు తేలే విషయం కాదు, కేసీఅర్ ఆరోగ్య రీత్యా అప్పటి పరిస్తితుల్లో ఆ ప్రకటన చేయవలసి వచ్చింది" అని. మొత్తం మీద తెలంగాణా విషయం కొంతకాలం అటకెక్కినట్టే. ఆ విషయం చెప్పడానికి కొన్ని చానల్స్‌కి గానీ టీఆరెస్‌కి గానీ మొఖం చెల్లలేదు. కేసీఅర్ కనీసం కెమేరాలవంక కూడా చూడకుండా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన ఏ ప్రకటన చేయాలా అని ఆలోచిస్తూ ఉండిఉండవచ్చు.

తెలంగాణా విషయంలో మొదటినుండీ ఎటువంటి తడబాటూ లేకుండా విశాల భావాలతో ఒక సైనికుడిలా తనవంతు కృషిని అవిరాళంగా చేసిన ఒకే ఒక్కడు జయప్రకాష్ నారాయణ్. నిజమైన సైనికుడిలా ఒకే ఒక్కడు ఢిల్లీ పెద్దలను కలిసి వారికి వాస్తవాలను వివరించి ఒక అవగాహనను కల్పించారు. సీమాంధ్ర నాయకులు ప్రజల వాణికి ఒక అదనపు ఆయుధంగా మరేరు. మొత్తం మీద సామరస్య వాతావరణానికి అనువైన పరిస్తితి కొద్దిగా కనిపిస్తోంది. దీనికి కారణం ఎంఐఎం రాష్ట్రపతి పాలన విధించాలని కోరడం. రాష్ట్రపతి పాలన విధిస్తే ప్రస్తుతానికి ఉన్న కొద్దిపాటి ఆశ కూడా టీఅరెస్‌కి ఉండదు. అందువల్లే ఈ మౌన ముద్ర.

జేపీ చైప్పిన మరో బంగారు మాట "ఒక పదిహేను రోజులు ఈ చాన్నళ్ళను మూసివెస్తే బాగుండు" ననిపిస్తోంది. ఆ క్షణం కోసమే ప్రజలంతా ఎదురుచూస్తున్నారు.

January 4, 2010

ప్రస్తుతానికి ప్రత్యేక తెలంగాణా హుళక్కే!!


రాష్ట్ర రాజకీయాల వేదిక హైదరాబాదునుండీ ఢిల్లీకి మారింది. ఇటు తెలంగాణా నాయకులు అటు సీమాంధ్రా నాయకులు వివిధ పక్షాలతో సంప్రదింపులు జరుపుతూ ఢిల్లీ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణా గొంతుకలు సన్నబడుతూ ఉంటే సమైక్యవాదం బలం పుంజుకుంటూ ఉంది. మరోవైపు రాష్ట్రంలో ఇటు తెలంగాణా ఉద్యమకారులు అటు సీమాంధ్ర ఉద్యమకారులు బందులకు రైల్ రోకోలకు పిలుపునిచ్చారు. దక్షిణ మద్య రైల్వే చాల రైళ్ళను నిలుపు చేస్తోంది. ఆర్టీసీ తమ బస్సులకు పూర్తి విశ్రాంతినివ్వడానికి నిర్నయించింది. లేని ఉత్కంఠతను పెంచే ప్రయత్నం చానల్స్ చేస్తూనే ఉన్నాయి. చర్చలతో ఏకాభి ప్రాయాన్ని సాధించాలని భావిస్తున్న కాంగ్రెస్‌లోనే ఏకాభిప్రాయం మృగ్యంగా తోస్తోంది.బర్దన్ తెలంగాణాకు తమ మద్దతును తెలియచేగా ప్రభుత్వం మరోవైపు భాగస్వామ్య పక్షాలనుండీ వస్తున్న వ్యతిరేకతల మధ్య భారతీయ జనతా పార్టీ తెలంగాణా పట్ల తమ వ్యతిరేకతను కాకపోయినా తమ అనుకూలతను మాత్రం తెలపట్లేదు. దేశవ్యప్తంగా రాష్ట్ర విభజన పట్ల వ్యతిరేకతనే కేంద్రం చవిచూస్తోంది. బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య చిదంబరంపై నిప్పులు చెరిగారు. తెలంగాణాపై చిదంబరం ప్రకటనను తూర్పారబెట్టారు. సీమాధ్రా ప్రతినిధుల వాదనలు బలం పుంజుకున్నట్టు వారి మాటలే చెపుతున్నాయి. దానిని నిజం చేస్తూ తెలంగాణాపై నిర్నయానికి గడువు లేదని ఇవి కేవలం సంప్రదింపులుమాత్రమే అంటూ కాంగ్రెస్ ప్రకటించింది. మరోవైపు తెలంగాణా ఉద్యమానికి మావొయిస్టుల సహకారం, సానుభూతి మేలుకన్న కీడే చెసేలా కనిపిస్తోంది. ప్రత్యేక తెలంగాణాకు ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ అనుకూలవాతావరణం లేదన్నది సుస్పష్టం. ప్రస్తుతం కాంగ్రెస్ కాలయాపన చేసి సమస్యను దాటవేయాలనే చూస్తోంది. కాబట్టి ప్రస్తుతానికి ప్రత్యేక తెలంగాణా లేనట్టే.

January 3, 2010

రాష్ట్రంలో రాష్త్రపతి పాలన తప్పదా?


నిన్న కొంతమండి పాత్రికేయ మితృలతో చిన్నపాటి గెట్-టుగదర్ జరిగింది. పిచ్చాపాటి నడుస్తూఉంటే ఒక సీనియర్ పాత్రికేయునికీ ఫోన్ వచ్చింది. అతడు "యాభై ఏళ్ళనుండి కలిసి ఉన్నాము. దానివల్ల మంచే జరిగిందని నేను నమ్ముతున్నాను. కాబట్టి నేను సమైక్య ఆంధ్రాయే కావాలంటాను" అని చెప్పాడు. దానితో నాకు కొంత ఉత్సుకత కలిగి దెనిగురించి మీ అభిప్రాయం చెపుతున్నారు అని అడిగాను. "ఒక పొలిటికల్ పార్టీ కొంతమందినుండీ అభిప్రాయ సేకరణ చేస్తోంది , దానికి నన్ను అడిగితే నేను నా ఉద్దేశ్యం చెప్పాను" అన్నాడు. అతడు తెలంగాణాకు చెందిన వ్యక్తే. ఐనా అతడి సమాధానం నాకు ఆశ్చ్యరం కలిగించింది. "అదేమిటి మిడియా లో అందరూ తెలంగాణాకు సపోర్ట్ చేస్తున్నారుగా?" అని అడిగితే "అందరూ కాదు " అన్నాడు. "మరి చానల్స్ అన్నీ కేసీఅర్ చుట్టూ తిరిగుతూ మంచి కవరేజ్ ఇస్తున్నాయి కద" అన్నాను. " అవునుగానీ అది ఒక భయంతో" అన్నారు. "మరి చాలామంది పాత్రికేయులు బహిరంగంగానే తమ మద్దతు తెలియచేస్తున్నారు కదా" అన్నాను. "దానికి కూడా ఒక కారణం ఉంది. పేపర్లన్నీ ఆంధ్రావాళ్ళవే. అదే వారి కోపానికి కారణం" అన్నాడు నవ్వుతూ. "మరి వారివద్ద పనిచేయడం ఇష్టం లేనప్పుడు మానియేవచ్చుకదా?" అని అడిగాను. "నేను అదే అడుగుతాను, అందుకే నా మాటలు వారికి నచ్చవు" అన్నారు ఆయన. "అంతే కాదు దేవులపల్లి అమర్‌ను కూడా ప్రెస్ అకాడమీ చైర్మన్ గా చేసింది వైఎస్సార్. అకాడమీ చైర్మన్ గా ఉంటూ ప్రత్యేక తెలంగాణకు మద్దతు తెలిపినప్పుడు అతనిని కూడా చైర్మన్‌గా రెజైన్ చేసి తెలంగాణా కోసం ఫైట్ చేయమని చెప్పాను. కాని పదవులని ఎవరు వదులుకుంటారు?' అన్నారు ఆయన. ఆ సీనియర్ పాత్రికేయుని పేరు చెప్పడం సబబు కాదని చెప్పట్లేదు. పాత్రికేయ సంఘాలలో మంచి పదవులే నిర్వహించారు ఆయన.

ఇక విద్యార్ధి గర్జన విషయానికి వస్తే జన సమీకరణ బాగానే చేసినా సభ నిర్వాహాణలో అనుభవ రాహిత్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. కోర్టు వారు ఆదేశించినట్టు విద్యార్దులే కాకుండా ముసలి విద్యార్ధులు కూడా సభలో పాల్గొన్నారు. నాకెందుకో ఉద్యమం కేసీఅర్ చేతిలోనుండీ నక్సలైట్ల చేతుల్లొకి పోయిందనే మాటలు నిజమేననిపించింది. దానికి కారణం నక్సలైట్ సానుభూతి పరులు వేదికపై సింహభాగం ఆక్రమించడం. విద్యార్ధులు రోశయ్య గారికి చంద్ర బాబుకి అల్టీమేటం ఇచ్చారు. తెలంగాణాను వ్యతిరేకించే పార్టీల కార్యాలయాలు కూలగొడతామని వాళ్ళు హెచ్చరించారు. పండుగలకు ఆంధ్రా వెళ్ళే ముప్ఫై లక్షల ఆంధ్రా వాళ్ళను తిరిగి రానివ్వమని హెచ్చరించారు. హైదరాబాదులో ఉండే ఆంధ్రావాళ్ళు చాలా కొద్దిమందేనని కేసీఅర్ గారు ఒక సందర్భంలో చెప్పారు. మరి వీరి సంఖ్య ఎంత ఉంటుందో సమయానుకూలంగా వారే చెప్పాలి. ఏది ఎద్మైనా విద్యార్దుల హెచ్చరికలు రాష్ట్రాన్ని మరింత ప్రమాదకర పరిస్తితిలోకి తీసుకెళ్ళడం ఖాయం.

ఇక ఐదవ తారీకు వస్తోంది. ఇటు తెలంగాణా అటు సీమాంధ్రా నాయకులు తమ వాదనలకు పదును పెట్టుకుంటున్నారు. ఇక్కడి ప్రజలు అక్కడి ప్రజలు ఉద్యమంలో తలమునకలైఉన్నారు. ఇక కాంగ్రెస్ ఏమి చేస్తుందో వేచి చూడాలి. అందరినీ కూర్చోబెట్టి బుజ్జగింపు కార్యక్రమం చేపట్టవచ్చు. తెలంగాణాకు అనుకూలంగా తమ ఎంఎల్ఏలపై కొంత వత్తిడి తేవచ్చు. అసెంబ్లీలో తీర్మానానికి వొప్పించవచ్చు. కానీ హైకమాండ్ మాటను ఎంఎల్ఏలు ఎంతవరకు వింటారు అనేది సందేహమే. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడితే తీర్మానం వీగిపోయే అవకాశాలు ఎక్కువ. కాబట్టి టీఅరెస్ కూడా దానికి సమ్మతించకపోవచ్చు. మధ్యస్తంగా హైదరబాదుకు కొంత వెసులుబాటు కల్పిస్తే తప్ప ఈ పీటముడి విడదు. నేరుగా పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెట్టేటంత ధైర్యం కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. కాబట్టి ఐదవ తారీకు తరువాత ఎక్కడి సమస్య అక్కడే ఉండడానికే అవకాశాలు ఎక్కువ. దీనివల్ల తెలంగాణాలో పరిస్తితుతులు మరింత విషమించి రాష్ట్రపతి పాలనకు దారితేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.


January 1, 2010

జనారణ్యంలో మానవ మృగాలు


వార్తలు చూద్దామని టీవీ పెడితే తెలంగాణా ఉద్యమకారుల ఊరేగింపును చూపిస్తున్నారు. అందరూ కొన్ని స్లోగన్లు ఇస్తున్నారు. వారు చెప్పే స్లోగన్ "తెలంగాణకడ్డొస్తే అడ్డంగా నరికేస్తాం" అంటూ చాలా రౌద్రంగా అరుస్తున్నారు. వారిలో అణగారిన వర్గానికి నాయకుడిగా చెపుతున్న మందమైన నాయకులు కూడా ఉన్నారు. వారు ఇచ్చే స్లోగన్‌కూడా "తెలంగాణకడ్డొస్తే అడ్డంగా నరికేస్తాం". ఎవరిని నరుకుతారు? సమైక్య ఆంధ్రాయే కావాలంటున్న ఆంధ్రా ప్రజలనా? లేక సమైక్య ఆంధ్రా కావాలనే ప్రజా ప్రతినిధులనా? ఇప్పటికే ప్రజలమధ్య భావొద్వేగాలు రెచ్చగొట్టి వారిని నిలువునా చీల్చారు. ఇక ఎదుటపడితే నరుక్కునే స్థాయికి నెమ్మదిగా చేర్చడమే ధ్యేయంగా పావులు కదుపుతున్నట్టుగా ఉంది. దానికి ప్రారంభంగా నిన్న రాత్రి నాకు తెలిసిన ఒక యువకుడిని నూతన సంవత్సర వేడుకలు చేసుకొని మరికొంత మందితో తిరిగి వస్తూ ఉంటే ఎల్‌బీ్‌నగర్ పరిసరాలలొ ఒక గుంపు దాడి చేసింది. కేవలం అతదు ఆంధ్రాకు చెందినవాడు కావడమేనట. తోటివారు వారిస్తున్నా కర్రలతో తలపగులగొట్టారు. అతడి తల్లిదండ్రులు ఆంధ్రావాళ్ళే అయినా అతడు పుట్టింది పెరిగిందీ హైదరాబాదులోనే. అతడి తల్లిదండ్రులు ఆంధ్రావారు కావడం అతడి తప్పా? అపస్మారక స్థితిలో అతడిని హాస్పటల్‌కు చేరిస్తే ఏడుకుట్లు పడగా ప్రమాదమునుండీ తృటిలో బైటపడ్డాడు. వీళ్ళు మనుషులా లేక మృగాలా? వీళ్ళు నాయకులా లేక పిశాచాలా? రాష్ట్రాన్ని పీనుగుల పెంటగా మార్చి వీరి అధికార దాహాన్ని తీర్చుకోవడమే పరమావధా? వీరిలో నెమ్మదిగా మానవత్వం నశించి దానవులుగా మారుతున్నారు. ఇంతవరకూ కేవలం ఆస్థులపైనే దాడి చేస్తున్న వీరు ఇకపై మనుషులపైనే దాడిని కొనసాగించదలిచారా? ఉద్యమాన్ని మరింత ఉదృతం చేయడం అంటే ఇదేనా? హైదరాబాదు దానవులకు నిలయంగా మారనుందా? ఆంధ్రాప్రజల రక్షణకు ఢోకా లేదంటున్న తెలంగాణా నాయకుల మాటలు కేవలం గాలిమాటలేనా? వీరి చర్యలకు మానవత్వం సిగ్గుతో తలవంచుకుంటుంది. త్వరలోనే పిశాచాలు రాజ్యమేలడానికి ఇది నాందిగాబోలు.