February 2, 2010

మృగ్యమౌతున్న మానవ బంధాలు


చిన్నారి వైష్ణవి చనిపోయింది. కాదు చంపబడింది. అందుకు పురిగొల్పింది స్వయానా ఆ చిన్నారి మేనమామట. ఆ వార్త విని తట్టుకోలేక ఆమె తండ్రి ప్రభాకర్ చనిపోయాడు. ఇలాటి సంఘటనలు మనం ఇరవై నాలుగు ఘంటలు ప్రసారమయ్యే టీవీ సీరియళ్ళలో మాత్రమే చూసి ఉంటాము. సీరియళ్ళలో ఆడవిలన్లు కోపంగా రెండుకోట్లు ఖర్చైనా వాడి అంతు చూడాలి అనడం మనం చాలసార్లు చూసి ఉన్నాము. ఇవి అంతరిస్తున్న మానవ బంధాలు తెలియచేస్తాయి. పాత సినీమాల్లో అయితే భార్య గయ్యాళిదైతే త్యాగం చేసి ఉన్న ఆస్తిని వదులుకొనె హేరో ఊరొదిలి వెళ్ళిపోతాడు. చివరకి హీరో భార్య అతని మంచితనం తెలుసుకొని అతడిదగ్గిరకు చేరుకుంటుంది.లేదా వైస్-వెర్సా. కాని ఇప్పటి సీరియళ్ళు అలా కాదు. భార్య భర్తల మధ్య మనస్పర్ధలు వస్తే భర్త్యను చంపించడానికి రెండు బ్రీఫ్‌కేసులనిండా డబ్బును విలన్‌కీచ్చి భర్తను చంపమంటుంది. లేదా భర్తే భార్యను చంపించడానికి ప్లాన్లు వేస్తాడు. ఈ రెండూ కాకుండా తన పూర్వపు భార్య ఎదురుగా మరో స్త్రీతో కాపురం పెట్టడం. ఇది అవతలివారికి ఎంత కడుపుమంటను కలిగిస్తుందో హావభావాలతో సీరియళ్ళలోనే మనం చూసి ఉన్నాము. తన అక్కకు, అక్క పిల్లలకు జరిగిన అన్యాయానికి తమ్ముడు ఏ విధంగా మండిపడతాడో కూడా మనకు తెలుసు. మరి మనుషులని చూసి సీరియల్స్ తయారు చేస్తారో లేక సీరియల్స్ ను చూసి మనుషులు అలా తయారవుతారో? పెద్దలు చేసిన పాపాలు పిల్లలకు తగులుతాయని మన పూర్వీకులు ఉత్తినే అనలేదు. కానీ పిల్లలు చేసిన పాపమేమిటో? ఏమైనా ఇవి అంతరించి పోతున్న బంధాలకు ఒక తార్కాణం. ఇలాటి విషయాలలో పోలీసులు నిమిత్తమాత్రులే!!

డబ్బూ డబ్బూ నువ్వేమి చేస్తావూ అంటే... ఆప్తులమధ్య వైరాన్ని సృష్టిస్తానూ అందిట!!

February 1, 2010

వైష్ణవిని చంపేశారు దుర్మార్గులు!!


చినారి చిట్టితల్లి, టీవీలో చిత్రాలలో చిరునవ్వులు ఒలకబోస్తూ అమాయకమైన కళ్ళు గోళీల్లా తిప్పుకుంటూ పుట్టినరోజుగాబోలు జరుపుకున్న కన్నతల్లి, నిండా పదేళ్ళనా లేని పసిమొగ్గ దుర్మార్గుల కర్కశత్వానికి బలైపోయింది. కిడ్నేపైన ఆ చిన్నారి గుంటూరులో నిర్జీవంగా దొరికింది. ఆమె మృతదేహాన్ని కునుగొన్నారని టీవీలో చూసినప్పుడు కళ్ళు చెమ్మగిల్లాయి. దారికాచి కారు డ్రైవర్‌ను హత్యచేసినప్పుడే కిడ్నాపర్ల రాక్షసత్వం తెలిసింది. అటువంటి రాక్షసులను ఎంతో సున్నితంగా ఎదుర్కోవాలి. ఎందుకంటే చిన్నారి వారి చేతుల్లో ఉందికాబట్టి. ఆ చిన్నారి ప్రాణాలతో బైటకు వచ్చేదాకా ఓపికబట్టి తరువాత దోషులను దొరకబుచ్చుకోవాలి. మీడియా చేస్తున్నది మంచో చెడో తెలియని పరిస్తితి. మీడియా చూపిన అత్యుత్సాహంకూడా ఆమె ప్రాణాలమీదకు తెచ్చిందేమో అనిపిస్తోంది. ఆమె ఫొటోను చూపిస్తూ గంటలు లెక్కిస్తూ పోలిసులు చేస్తున్న గూఢచర్యాన్ని ఎప్పటికప్పుడు బట్టబయలు చేస్తూ ఆ సంఘటనను ఒక పెద్ద వివాదంగా మార్చకుండా ఉంటే ఆమె తండ్రివద్దనుండీ కొంత సొమ్ము దొరకబుచ్చుకొని ఆమెను వదిలేశేవారేమో? అప్పుడా చిన్నారి ప్రాణాలతో బైటపడి ఉండేదేమో. కానీ పోలీసుల చేతలు ఎప్పటికప్పుడు చెప్పివేస్తూ వారి ఆచూకీ దొరికే అవకాశం ఏర్పడిందన్న సందర్భములో తప్పించుకోవీలులేక దుర్మార్గులు ఆ చిన్నారిని చంపివేసి ఉంటారు. వారు క్షమార్హులు కారు. ముమ్మాటికి వారిని పట్టి ఉరికంబం ఎక్కించాలి. ఇప్పుడు మీడియావాళ్ళు ఆ చిన్నారి తల్లిదండ్రుల రోదనలు క్లోజప్‌లో బంధించడానికి ఆపసోపాలు పడుతూ ఉంటారు. మీడియాకు ఎప్పుడూ ఒక విషయం కావాలి. వైష్ణవి తల్లిదండ్రులకు మన సానుభూతిని తెలియచేయడంతప్ప మనమేమి చేయగలం?

January 25, 2010

తలలు బోడులైన తలపులు బోడులౌనా?


తెలంగాణా ఉద్యమంలో ఒకవ్యక్తి ముగ్గుబుట్టలంటి జుట్టుతో వేదికలను అలంకరిస్తూ ఉండేవారు. నెమ్మదిగా ఏకు మేకైనట్టు, తొండ ఊసరవెల్లిగా మారినట్లుగా ఆయన తన స్వరూపాన్ని మర్చుకుంటూ ఒక కరడుగట్టిన రాజకీయవేత్తగా మారుతూ కాకలు తీరిన రాజకీయవేత్తలనే హెచ్చరించే స్థాయికి చేరాడు. ఆయన మరెవ్వరో కాదు కోదండరాం. ప్రొఫెసర్ కోదండరాం. మేధావిగా తెలంగాణా ఉద్యమంలో అడుగుపెట్టి రాజకీయ జేఏసీలో కన్వీనర్ స్థానాన్ని ఆక్రమించిన ఈయన తాను ఒక ప్రభుత్వ ఉద్యోగి అని మరచిపోయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాప్రతినిధులను విమర్శిస్తూ వారిని రాజీనామాలను సమర్పించాలని డిమాండ్ చేయడమే కాకుండా ఈయన కోరే గొంతెమ్మ కోరికలు, వ్యాఖ్యానాలూ కూడా ఏ రాజకీయవేత్త చేయలేడు. గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ తెలంగాణా విద్యార్దుల పరీక్షా పత్రాలు మార్కుల కొలమానానికి ఆంధ్రా ఉపాధ్యాయులకు పంపకూడదని వీరి మొదటి కోరిక. ఆవిధంగా పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిని అపవిత్రం చేయాలనుకున్న సదరు ఈ వ్యక్తి ఒక రాజకీయ జేఏసికి కన్వీనర్ ఎలా కాగలిగాడో? తెలంగాణా పౌరుడిగా ఆయన తన అభిప్రాయాన్ని చెప్పడంలో తప్పులేదుగానీ ఒక రాజకీయ కూటమికి కన్వీనర్‌గా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండడానికి వీలులేదు. పైగా అతడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మద్దతును కూడగడుతున్నదుకు ఆయనను సత్వరమే సస్పెండ్ చేసి ప్రభుత్వ వ్యతిరేక కుట్రలు పన్నుతున్నందుకు ఆయనను ప్రాసిక్యూట్ చేయాలి. ఈయననే కాదు, ప్రభుత్వ జీత భత్యాలు తీసుకుంటూ ఉద్యమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరినీ సస్పెండ్ చేయాలి. గత కొంతకాలం క్రితం తమిళనాడులో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకే రాజపత్రంతో రెండు లక్షలమంది ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ చేసిన సంఘటనను న్యాయస్థానం కూడా సమర్ధించింది. ప్రభుత్వం చూపుతున్న ఈ ఉదాసీనతను చేతగానితనంగా భావిస్తున్న అందరినీ ఒక దారికి తీసుకురావలసిన భాద్యత ప్రభుత్వానిదే.


January 20, 2010

ఎవరికోసం ఈ త్యాగాలు?




వరంగల్ జిల్లాలో రెండేళ్ళ పిల్లవాడు బోరుబావిలో పడి ప్రాణలకోసం కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఆంధ్రదేశమంతా ప్రార్ధనలు చేసింది, ఆ బిడ్డ ప్రాణాలు కాపాడమని. ఆ బిడ్డ ప్రాణాలు పోయాయని తెలిసినప్పుడు అందరూ ఒక్కలా కన్నిరుమున్నీరై విలపించారు. అది మానవత్వం. కానీ రాష్ట్రాన్ని విభజించండీ అంటూ తనకుమాలిన కోరికలతో ఆత్మత్యాగాలు పేరిట ప్రాణాలు తీసుకుంటున్న యువకులపట్ల అందరూ అలా స్పందిస్తున్నారా? కొంతమందైతే కావచ్చుగానీ ఖచ్చితంగా అందరూ కాదు. వారి ప్రాణాలు కోల్పోయినందుకు బాధపడ్డా ప్రజలు శాపనార్ధాలు పెట్టేది మాత్రం దిక్కుమాలిన రాజకీయనాయకులనే. ఇరవై ఏళ్ళ వయసులొ సమైక్య ఆంధ్రలో వ్యక్తిగతంగా వీళ్ళు పడ్డ కష్టమేమిటో, ప్రత్యేక రాష్ట్రంలో వీరు అనుభవించబోయే భోగ భాగ్యాలేమిటో వీరికి తెలుసా? నువ్వు నష్టపోయావు అంటే కాబోలు అనుకునే ప్రజలున్నంత వరకూ ఈ మృత్యుహేల కొనసాగుతూనే ఉంటుంది. చనిపోయినవాడు చేసినది పిచ్చి పని అని అందరూ ముక్త కంఠంతో ఖండించాల్సింది పోయి, నీది మహోన్నత త్యాగం, నువ్వు అమరుడవు, నీ త్యాగాన్ని తెలంగాణా ప్రజలు మరచిపోలేరు అంటూ మరింతమందిని ఆత్మహత్యలకు పురిగొల్పే వీళ్ళు నాయకులా? వీళ్ళు ఉద్యమకారులా? రాజకీయ జేఏసీలో ఎవరైనా ఒక్కరు ఆత్మాహుతి చేసుకొని తమ అమరత్వాన్ని చాటుకోవచ్చుగా. వాళ్ళ పదవులు వదులుకోవడానికే మల్లగుల్లాలు పడే వీళ్ళు ప్రాణాలు పణంగా పెడతారా?

తెలంగాణా ఉద్యమంలో ఎన్నో దృక్కోణాలు. ఎవరి స్వార్ధం వారిది. ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొనె కోట్లకు పడగలెత్తినవాళ్ళూ లేకపోలేదు. ఓయూ విద్యార్దుల జేఏసీకి అక్షరాలా మూడు కోట్ల రూపాయలు అందాయని సమాచారం. వాటి పంపకంలో విద్యార్ధుల మధ్య ఎన్నో లుకలుకలు నడుస్తున్నాయన్నది మీడియాలో ప్రస్తుత కధనం. కానీ ఎవరికీ బైటపెట్టే దమ్ములేదు. ఇవేమీ తెలియని అమాయక విద్యార్ధులు తమవంతు త్యాగాలను చేస్తునే ఉన్నారు. ఇంతవరకూ పదండి ముందుకు అంటూ జనాన్ని ఎగదోసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి పదవులకు రాజీనామా అనేసరికి, ప్రభుత్వం పడిపొతే (తనకు) తెలంగాణాకు నష్టం అంటూ మరో పల్లవి అందుకున్నారు.

ఏదిఏమైనా అన్నీ సద్దుమణగాలంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి. రెచ్చగొట్టే నాయకులను నోరు మూయించి లోపల వెయ్యాలి. ముఖ్యంగా న్యూస్ చానల్స్‌ను కూడా కొంతకాలం ప్రసారాలు నిలుపు చేయించాలి. ప్రశాంత వాతావరణం ఏర్పడ్డాక ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి సరియైన నిర్నయం తీసుకోవాలి. బహుశా జరుగబోయేది అదే కావచ్చు!!

January 18, 2010

రంపపు కోతలాంటి రాతలెందుకో?




బ్లాగుల్లో కొన్ని టపాలు చదువుతూ ఉంటే చిన్న చిరునవ్వు అలా మెరిసి చటుక్కున మాయమౌతుంది. అలా అనిపిస్తే ఆ టపాకు ఒక సార్ధకత చేకూరినట్టే. టపా బాగున్నప్పుడు కామెంటడానికి బాగుంది అని చెప్పడం రోటీన్ అనిపించినప్పుడు నేనైతే చిన్న చిరునవ్వు :) వదిలిపెడతాను. నేను చదివాను మీ టపా నాకు నచ్చింది అని చెప్పడానికి. కానీ కొన్ని బ్లాగరుల రూటే వేరు. వారు ఏది చేసినా ఒక సంచలనం కోరుకుంటారు. అది వ్యతిరేకతతో కూడినదైనా సరే. వారి రాతలలో ఎన్నో నికృష్ట భావాలు కనబడుతూ ఉంటాయి. మనుషులలో నిబద్దత వీరికి నచ్చదు, సమాజమంటే ఏవగింపు, మనుషులపై అకారణ ద్వేషం వీరి రాతల్లో కనబడతాయి. సమాజంలో ఒక్క మంచి సంఘటన కూడా వీరి కంటికి కనబడదు. పదిమంది మెచ్చినది వీరు మెచ్చరు. పదిమంది చీ అంటే వీరు అద్భుతం అంటారు. అదేమి మిత్రమా అని అడిగితే కొన్ని పడికట్టుపదాలతో వీరు అర్ధం కాని భావాలెన్నొ చెప్పగలరు. పైగా ఇది నా బ్లాగు, నా ఇష్టం అంటారు. మరింత ముదిరితే మిమ్మలని నా భావాలతో ఏకీభవించమని నేను అడగలేదు, అసలు నా బ్లాగు చూడమని కూడా చెప్పలేదు అంటారు. కొన్ని టపాలు చదివినప్పుడు కొందరికి కలిగే భావాలు ఎలా ఉంటాయొ చిన్న ఉదాహరణ ఇస్తున్నాను.

"అయితే మీ శ్రేయోభిలాషిగా మీకోమాట చెబుదామనుకుంటున్నాను. లౌకికవాది అనే ముసుగు వేసుకున్నాను గదా నేనేంటో అసలెవరికీ తెలియదులే అని మీరు ఇంకా అనుకుంటూనే ఉన్నారు గదా! కాని అది తప్పు సార్.. ఆ ముసుగు చాలా పల్చగా ఉంది. ముసుగులోంచి మీ వంటిమీది చారలు స్పష్టంగా కనబడిపోతున్నాయి. క్రూరమైన కోరలు (కరాళ దంష్ట్రలవి :) ) నోట్లోంచి కారుతున్న చొంగా కనిపిస్తూనే ఉన్నాయి. అసహనం కారణంగా మీ గొంతులోంచి వచ్చే గురక వినిపిస్తూనే ఉంది. ఇక దాచలేరు సార్, ఆ ముసుగు తీసెయ్యండి. అసలు రూపును బయటపెట్టండి"

మనం రాసిన రాతలకు అవతలివారికి ఎంత ఒళ్ళు మండితే ఇలాటి కామెంట్లు వస్తాయి చెప్పండి. మన టపా చదివిన అందరికీ నచ్చాలని లేదు కానీ, చాలా మంది అసహనాన్ని వెళ్ళగక్కితే దానిలో కొంత లోపమున్నట్టే. మీరేమంటారో?

January 15, 2010

యార్లగడ్డ "ద్రౌపది" నవలపై బ్లాగుల్లో రాతలు....కామెంట్లు ....


హిందూ సంస్కృతి పరిరక్షణకు నేనేమి నడుము కట్టుకోలేదు. కానీ కొందరు హిందూ సాంప్రదాయాలపై దాడి అంటే మాత్రం ముందు వరుసలో నిలుస్తారు. అలాటివారిలో మన బ్లాగరు కత్తి మహేష్ కుమార్ గారు ఒకరు . యార్లగడ్డ రాసిన పుస్తకాన్ని వీరు చదువలేదు. అయినా ఆపుస్తకంపై ఒక టపా రాస్తూ ఆపుస్తకాన్ని విమర్శించిన వ్యక్తులపై వీరు విమర్శల వర్షం కురిపించారు. ఎందుకంటే ఆ పుస్తకంలో విమర్శకుల విమర్శలప్రకారం హిందూ సాంప్రదాయలపై దాడి జరిగిందికాబట్టి అది ఎలాటిదాడో తెలియకపోయినా అది వీరికి ఇష్టంకాబట్టి ఆ దాడిని వీరు సమర్ధిస్తారు. మహాభారతం యదార్ధమో కాదోనన్న విషయం పక్కనబెడితే ఆ కధలో ద్రౌపదికి ఐదుగు భర్తలున్న స్త్రీ అయినా ఒక ఉత్తమ స్త్రీగా చిత్రికరిస్తూ స్త్రీయెడల ఉన్నత భావాలు కలిగించారు. అయిదుగు భర్తలు గలిగిన స్త్రీ అంటే మిగిలిన విషయాలు విడమరచి చెప్పవలసిన అగత్యం లేదు. కానీ సోమవారం ఒకరితో సుఖించినది, మంగళవారం ఒకరితో సుఖించినది బుధవారమం మరొకరితో సుఖించినది అని చెప్పడంలోనే రచయిత ఉద్దేశ్యం బయట పడుతుంది. కొంతమందికి కొన్ని సమయాలలో కీర్తికోసం వెంపర్లాట మొదలౌతుంది. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు పండితులు వారికి అన్ని గ్రంధాలు కరతలామలకం. కానీ ఎంతటివారైనా కొన్ని క్షణాలలో కీర్తి ప్రతిష్టలు కోరుకొవడం మానవ లక్షణం. కానీ ఆ పుస్తకం చదవకపోయినా మహేష్ గారి అత్యుత్సాహం కూడా ఇలాటిదే. ఆ పుస్తకాన్ని నేను చదవలేదు. తెలుగు సాహిత్యానికి గుర్తింపు రాలేదేనని మహేష్ బాధ పడుతున్నారుట. పురాణా ఇతిహాసాలని అపహాస్యం చేస్తూ కీర్తిని గడించాలని కోరుకోవడం సరియైనదేనా? ఆ బ్లాగులో వచ్చిన కామెంట్లు కూడా ఆశ్చర్యం కలిగించాయి. ద్రౌపదికి అయిదుగురు భర్తలను ఎలా కట్టబెట్టారు అని రచయిత అడిగిఉంటే బాగుండేదిగానీ అయిదుగురితో ఎలా సుఖించినదో తెలియచేయడంలోని ఔచిత్యం ఏమిటో మహేష్ రచయిత తరపున తెలియచేస్తారా?


ఏది సంస్కృతో చెప్పి మాకళ్ళు తెరిపించండి !!


బ్లాగుల్లో సంక్రాంతి సంబరాలగురించి కొంతమంది చక్కగా చెప్పారు. పదిమందీ కలిసి చేసుకొనే పండుగల్లో సంక్రాంతి ఒకటి. రైతులకు పంట చేతికొచ్చాక ఇంటిల్లిపాదీ ఆనందంగా గడుపుకొనే సంతోషకరమైన రోజులు. వాటిని మరింత శోభాయమానంగా చేసుకోవడానికి ఇంటికి కొత్త సున్నాలు, ఇంటిముందు ముగ్గులు, గొబ్బెమ్మలు, భొగి మంటలు ఒక అదనపు ఆకర్షణలు. రైతులు అహ్లాదకరంగా గడపడానికి కోళ్ళ పందేలు. ఆంధ్ర దేశంలో ఎంతోమంది ఎన్నో దశాబ్దాలుగా చేసుకుంటున్న పండుగ. ఇదా సంస్కృతి అంటూ కొంతమంది వెక్కిరించడానికి నాకేమి కారణాలు కనబడడటం లేదు. సంస్కృతి అంటే ఏమిటో? అందరూ ఒక విధానాన్ని సంవత్సరాలుగా చేస్తూపొతే తరువాతి కాలంలో అదే సంస్కృతి అవుతుందని నా మట్టి బుర్రకు తోచింది. మరి ఇంతకుమించి సంస్కృతి అంటే ఏమొటో వెక్కిరించేవాళ్ళు చెపితే మా కళ్ళు తెరుచుకుంటాయి. హిందూ సంస్కృతి అంటే కొంతమందికి చులకన బావన ఎందుకో అర్ధం కాదు. ఆ వెక్కింతను సహేతుకంగా వివరిస్తే కొంత తెలుసుకొనే ప్రయత్నమైనా చేస్తాము. ముగ్గులూ, గొబ్బెమ్మలూ,భోగిమంటలూ, గంగిరెద్దులూ సంస్కృతా అంటే? అది కాకపోవచ్చు అనిపిస్తే మరేదో చెప్పాలి. కేవలం ఒక ప్రశ్నను వేసి గేలి చేయడం సరికాదేమో! ముఖ్యంగా ఇటువంటి టపాలు ఆకతాయీలు రాస్తే అస్సలు పట్టించుకోనక్కర్లేదు. కానీ అన్నీ తెలిసినవాళ్ళే ఆకతాయీల్లా రాస్తున్నప్పుడు స్పందించక తప్పదు. వారి రాతలను మరింత సహేతుకంగా రాయాలిగానీ, కేవలం ఇదా సంస్కృతి అని ప్రశ్నించి వదిలివేయడం మంచిది కాదు.