February 19, 2010

మనిషివా....జర్నలిస్టువా..??


ఒక మనిషి రోడ్డుమీద ప్రమాదవశాత్తూ గానీ దాడికి గురైగానీ నెత్తురోడుతూ కనిపిస్తే మీరేమి చేస్తారు? అతన్ని సేదదీర్చడానికి సురక్షిత ప్రదేశానికి మార్చి వెంఠనే ఆంబులెన్స్‌కో లేక పోలీసులకో కబురంపుతారు. కానీ ఇవేమి చేయకుండా అతని బాధను ఏవిధంగా అనుభవిస్తున్నాడో తెలుసుకుంటూ అతను చెప్పలేని స్తితిలో ఉన్నాకూడా సహాయం చేయడం మానేసి అతన్ని ప్రశ్నలతో విసిగిస్తూ కారుతున్న రక్త ధారల్ని చిత్రీకరిస్తూ అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయేవరకు వేచి చూసేవాడే జర్నలిస్టు. ఇలాటి సంఘటనలు మనం అనేక చానల్స్ లో చూసిఉన్నాము కూడా. ఇటీవలికాలంలో జర్నలిస్టులు ప్రజల అభిప్రాయాలు చెప్పవలసింది పోయి స్టూడియోలో కూర్చొని తమ సొంత పైత్యాన్ని ప్రజలపై రుద్దుతూ ఇదే ప్రజల అభిప్రాయం అనుకోమంటూ, అనామకుల నోటిముందు మైకులుంచి వారు వాగే అవాకులు చవాకులూ ప్రసారం చేస్తూ చంకలు గుద్దుకునేవాడే జర్నలిస్టు. ఒకప్పుడు జర్నలిస్టులపై దాడి అంటే ప్రజలు కూడా మహాపరాధం జరిగిపోయిందనే భావనలో ఉండేవారు. ప్రభుత్వం కూడా అలాటి సంఘటనలకు వెంఠనే స్పందించేది. కానీ ఇప్పుడు పరిస్తితులు మారిపోయాయి. మీడియా స్వేచ్చ పేరుతో ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని కూడా వ్యక్తిగతంగా ప్రజాభిప్రాయం పేరుతో దాడిచేయడం చాలా మామూలు విషయంగా మారిపోయింది.ఉస్మానియాలో పోలీసుల చర్యలను సమర్ధించకపోయినా దానికి కారణాలను ఏమాత్రం చూపకుండా పూర్తి బాధ్యతను పోలీసులపైకి నెట్టివేస్తే పోలిసులకు మండుకొచ్చి ఒక చాకిరేవు మీడియా ప్రతినిధులకు కూడా పెట్టారు. దానికి ప్రతిగా రేపటి బడ్జెట్ వార్తల ప్రసారాలను నిలిపివేసి తమ నిరసనను తెలియచేయాలని నిర్నయించారుట. ఒక్క విషయం చెప్పాలి!! వీళ్ళు చెప్పే వార్తలకోసం ఎవ్వరూ పడిగాపులుపడి ఎదురు చేడట్లేదు. ఇంకా చెప్పాలంటే వార్తా చానల్స్ లేని రోజుకోసమే ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వీరి డిమాండ్లు ఎవైనా ఉంటే తక్షణమే......స్పందించకుండా ఒక నెల రోజులు వేచి చూడాలని మనస్పూర్తిగా కోరుకుంటూ....!!

February 12, 2010

తెలంగాణా పులకేసి మళ్ళీ తెరపైకి...ఈ మద్య లోకమంతా అప్రశాంతంగా, ఏదో కోల్పోయినట్టు, టీవీలన్నీ బోసిపోయినట్టు, విలేకరులంతా తెగులుపట్టిన కోళ్ళలా మెడలు వంగిపోయి, ముఖ్యంగా తెలుగు న్యూస్ చానల్స్ అన్నీ దివాళా తీసిన వ్యాపారుల్లా దీనంగా ఉండడం మీరు గమనించే ఉంటారు. కారణం మీకు తెలిసి ఉండదు! అదే మా తెలంగాణా పులకేసి అస్సలు పేపరోళ్ళవైపు, చానల్స్‌వైపు చూడడం మానివేయడంవల్లే. ఇదిగో నిన్నటినుండీ విలేకరులకు కాస్త ముద్ద గొంతు దిగుతోంది. ఎందుకంటే నిన్ననే మా తెలంగాణా పులకేసి మళ్ళీ టీవీలో కనిపించాడు. కనిపించడమేకాదు బోలెడు విషయాలు చెప్పాడు. వస్తూనే అతడన్నది ఆంధ్రోళ్ళు అంటే పెట్టుబడిదార్లు ఆంధ్రాలో చేసింది అస్సలు ఉద్యమమేకాదుట. ఉద్యమమంటే తెలంగాణాలో జరుగుతున్నదేట. ఇంకా శ్రీకృష్ణ కమీషన్‌పై అతడి అభిప్రాయలు కొన్ని చెప్పాడు. అసలు తెలంగాణా ఇవ్వాలా వద్దా అని రాష్ట్రంలో ఎవ్వరినీ అడక్కూడదట. ఆంధ్రోళ్ళనిగానీ, సీమోళ్ళనిగానీ, హైదరాబదీలనిగానీ. మరి ఎవరిని అడగాలి? పులకేసిని అడగొచ్చంట, ఇంకా వాళ్ళ అల్లుడిని అడగొచ్చుంట, ఇంకా పులకేసి కూతురునికూడా అడగొచ్చంట. తెలంగాణా ఇవ్వాలని తేల్చడానికి పదినెలలెందుకు అని తెలివిగా అడిగాడు. కేవలం పది సెకన్లు చాలుట. లేదంటే ఒక వారమో పదిరోజుల్లోనో సరిపెట్టుకోవాలిట. అసలు తెలంగాణా ఇవ్వడంకోసమే కమిటీ వెయ్యాలిగనీ ఇంకా అడిగేదేంటని అన్నాడు మా పులకేసి. ఇక తాము త్యాగాలు చేయక తప్పదని కూడా చెప్పాడు. అంటే ఆయన ఇంతకుముందు ప్రకటించినట్టు తల నరుక్కుంటాడేమోన్ని ఆశగా ఎదురు చూసేరు... అదేమికాదు. పదవులకు మరోసారి రాజీనామాలు చేసి, వాటిని నిజ్జంగా ఆమోదింపచేసుకుంటాడుట. అదీ సంగతి!! ఇకనుండీ మళ్ళీ కొన్ని రోజులు అందరికీ ముఖ్యంగా నక్సలైట్ చానల్స్‌కి, పోరంబోకు చానల్స్‌కి పండగే పండుగ. మనం కుడా చూసి సరదా పడదాం. ఏమంటారు?

February 2, 2010

మృగ్యమౌతున్న మానవ బంధాలు


చిన్నారి వైష్ణవి చనిపోయింది. కాదు చంపబడింది. అందుకు పురిగొల్పింది స్వయానా ఆ చిన్నారి మేనమామట. ఆ వార్త విని తట్టుకోలేక ఆమె తండ్రి ప్రభాకర్ చనిపోయాడు. ఇలాటి సంఘటనలు మనం ఇరవై నాలుగు ఘంటలు ప్రసారమయ్యే టీవీ సీరియళ్ళలో మాత్రమే చూసి ఉంటాము. సీరియళ్ళలో ఆడవిలన్లు కోపంగా రెండుకోట్లు ఖర్చైనా వాడి అంతు చూడాలి అనడం మనం చాలసార్లు చూసి ఉన్నాము. ఇవి అంతరిస్తున్న మానవ బంధాలు తెలియచేస్తాయి. పాత సినీమాల్లో అయితే భార్య గయ్యాళిదైతే త్యాగం చేసి ఉన్న ఆస్తిని వదులుకొనె హేరో ఊరొదిలి వెళ్ళిపోతాడు. చివరకి హీరో భార్య అతని మంచితనం తెలుసుకొని అతడిదగ్గిరకు చేరుకుంటుంది.లేదా వైస్-వెర్సా. కాని ఇప్పటి సీరియళ్ళు అలా కాదు. భార్య భర్తల మధ్య మనస్పర్ధలు వస్తే భర్త్యను చంపించడానికి రెండు బ్రీఫ్‌కేసులనిండా డబ్బును విలన్‌కీచ్చి భర్తను చంపమంటుంది. లేదా భర్తే భార్యను చంపించడానికి ప్లాన్లు వేస్తాడు. ఈ రెండూ కాకుండా తన పూర్వపు భార్య ఎదురుగా మరో స్త్రీతో కాపురం పెట్టడం. ఇది అవతలివారికి ఎంత కడుపుమంటను కలిగిస్తుందో హావభావాలతో సీరియళ్ళలోనే మనం చూసి ఉన్నాము. తన అక్కకు, అక్క పిల్లలకు జరిగిన అన్యాయానికి తమ్ముడు ఏ విధంగా మండిపడతాడో కూడా మనకు తెలుసు. మరి మనుషులని చూసి సీరియల్స్ తయారు చేస్తారో లేక సీరియల్స్ ను చూసి మనుషులు అలా తయారవుతారో? పెద్దలు చేసిన పాపాలు పిల్లలకు తగులుతాయని మన పూర్వీకులు ఉత్తినే అనలేదు. కానీ పిల్లలు చేసిన పాపమేమిటో? ఏమైనా ఇవి అంతరించి పోతున్న బంధాలకు ఒక తార్కాణం. ఇలాటి విషయాలలో పోలీసులు నిమిత్తమాత్రులే!!

డబ్బూ డబ్బూ నువ్వేమి చేస్తావూ అంటే... ఆప్తులమధ్య వైరాన్ని సృష్టిస్తానూ అందిట!!

February 1, 2010

వైష్ణవిని చంపేశారు దుర్మార్గులు!!


చినారి చిట్టితల్లి, టీవీలో చిత్రాలలో చిరునవ్వులు ఒలకబోస్తూ అమాయకమైన కళ్ళు గోళీల్లా తిప్పుకుంటూ పుట్టినరోజుగాబోలు జరుపుకున్న కన్నతల్లి, నిండా పదేళ్ళనా లేని పసిమొగ్గ దుర్మార్గుల కర్కశత్వానికి బలైపోయింది. కిడ్నేపైన ఆ చిన్నారి గుంటూరులో నిర్జీవంగా దొరికింది. ఆమె మృతదేహాన్ని కునుగొన్నారని టీవీలో చూసినప్పుడు కళ్ళు చెమ్మగిల్లాయి. దారికాచి కారు డ్రైవర్‌ను హత్యచేసినప్పుడే కిడ్నాపర్ల రాక్షసత్వం తెలిసింది. అటువంటి రాక్షసులను ఎంతో సున్నితంగా ఎదుర్కోవాలి. ఎందుకంటే చిన్నారి వారి చేతుల్లో ఉందికాబట్టి. ఆ చిన్నారి ప్రాణాలతో బైటకు వచ్చేదాకా ఓపికబట్టి తరువాత దోషులను దొరకబుచ్చుకోవాలి. మీడియా చేస్తున్నది మంచో చెడో తెలియని పరిస్తితి. మీడియా చూపిన అత్యుత్సాహంకూడా ఆమె ప్రాణాలమీదకు తెచ్చిందేమో అనిపిస్తోంది. ఆమె ఫొటోను చూపిస్తూ గంటలు లెక్కిస్తూ పోలిసులు చేస్తున్న గూఢచర్యాన్ని ఎప్పటికప్పుడు బట్టబయలు చేస్తూ ఆ సంఘటనను ఒక పెద్ద వివాదంగా మార్చకుండా ఉంటే ఆమె తండ్రివద్దనుండీ కొంత సొమ్ము దొరకబుచ్చుకొని ఆమెను వదిలేశేవారేమో? అప్పుడా చిన్నారి ప్రాణాలతో బైటపడి ఉండేదేమో. కానీ పోలీసుల చేతలు ఎప్పటికప్పుడు చెప్పివేస్తూ వారి ఆచూకీ దొరికే అవకాశం ఏర్పడిందన్న సందర్భములో తప్పించుకోవీలులేక దుర్మార్గులు ఆ చిన్నారిని చంపివేసి ఉంటారు. వారు క్షమార్హులు కారు. ముమ్మాటికి వారిని పట్టి ఉరికంబం ఎక్కించాలి. ఇప్పుడు మీడియావాళ్ళు ఆ చిన్నారి తల్లిదండ్రుల రోదనలు క్లోజప్‌లో బంధించడానికి ఆపసోపాలు పడుతూ ఉంటారు. మీడియాకు ఎప్పుడూ ఒక విషయం కావాలి. వైష్ణవి తల్లిదండ్రులకు మన సానుభూతిని తెలియచేయడంతప్ప మనమేమి చేయగలం?