ఒక మనిషి రోడ్డుమీద ప్రమాదవశాత్తూ గానీ దాడికి గురైగానీ నెత్తురోడుతూ కనిపిస్తే మీరేమి చేస్తారు? అతన్ని సేదదీర్చడానికి సురక్షిత ప్రదేశానికి మార్చి వెంఠనే ఆంబులెన్స్‌కో లేక పోలీసులకో కబురంపుతారు. కానీ ఇవేమి చేయకుండా అతని బాధను ఏవిధంగా అనుభవిస్తున్నాడో తెలుసుకుంటూ అతను చెప్పలేని స్తితిలో ఉన్నాకూడా సహాయం చేయడం మానేసి అతన్ని ప్రశ్నలతో విసిగిస్తూ కారుతున్న రక్త ధారల్ని చిత్రీకరిస్తూ అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయేవరకు వేచి చూసేవాడే జర్నలిస్టు. ఇలాటి సంఘటనలు మనం అనేక చానల్స్ లో చూసిఉన్నాము కూడా. ఇటీవలికాలంలో జర్నలిస్టులు ప్రజల అభిప్రాయాలు చెప్పవలసింది పోయి స్టూడియోలో కూర్చొని తమ సొంత పైత్యాన్ని ప్రజలపై రుద్దుతూ ఇదే ప్రజల అభిప్రాయం అనుకోమంటూ, అనామకుల నోటిముందు మైకులుంచి వారు వాగే అవాకులు చవాకులూ ప్రసారం చేస్తూ చంకలు గుద్దుకునేవాడే జర్నలిస్టు. ఒకప్పుడు జర్నలిస్టులపై దాడి అంటే ప్రజలు కూడా మహాపరాధం జరిగిపోయిందనే భావనలో ఉండేవారు. ప్రభుత్వం కూడా అలాటి సంఘటనలకు వెంఠనే స్పందించేది. కానీ ఇప్పుడు పరిస్తితులు మారిపోయాయి. మీడియా స్వేచ్చ పేరుతో ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని కూడా వ్యక్తిగతంగా ప్రజాభిప్రాయం పేరుతో దాడిచేయడం చాలా మామూలు విషయంగా మారిపోయింది.ఉస్మానియాలో పోలీసుల చర్యలను సమర్ధించకపోయినా దానికి కారణాలను ఏమాత్రం చూపకుండా పూర్తి బాధ్యతను పోలీసులపైకి నెట్టివేస్తే పోలిసులకు మండుకొచ్చి ఒక చాకిరేవు మీడియా ప్రతినిధులకు కూడా పెట్టారు. దానికి ప్రతిగా రేపటి బడ్జెట్ వార్తల ప్రసారాలను నిలిపివేసి తమ నిరసనను తెలియచేయాలని నిర్నయించారుట. ఒక్క విషయం చెప్పాలి!! వీళ్ళు చెప్పే వార్తలకోసం ఎవ్వరూ పడిగాపులుపడి ఎదురు చేడట్లేదు. ఇంకా చెప్పాలంటే వార్తా చానల్స్ లేని రోజుకోసమే ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వీరి డిమాండ్లు ఎవైనా ఉంటే తక్షణమే......స్పందించకుండా ఒక నెల రోజులు వేచి చూడాలని మనస్పూర్తిగా కోరుకుంటూ....!!
February 19, 2010
February 12, 2010
తెలంగాణా పులకేసి మళ్ళీ తెరపైకి...
ఈ మద్య లోకమంతా అప్రశాంతంగా, ఏదో కోల్పోయినట్టు, టీవీలన్నీ బోసిపోయినట్టు, విలేకరులంతా తెగులుపట్టిన కోళ్ళలా మెడలు వంగిపోయి, ముఖ్యంగా తెలుగు న్యూస్ చానల్స్ అన్నీ దివాళా తీసిన వ్యాపారుల్లా దీనంగా ఉండడం మీరు గమనించే ఉంటారు. కారణం మీకు తెలిసి ఉండదు! అదే మా తెలంగాణా పులకేసి అస్సలు పేపరోళ్ళవైపు, చానల్స్‌వైపు చూడడం మానివేయడంవల్లే. ఇదిగో నిన్నటినుండీ విలేకరులకు కాస్త ముద్ద గొంతు దిగుతోంది. ఎందుకంటే నిన్ననే మా తెలంగాణా పులకేసి మళ్ళీ టీవీలో కనిపించాడు. కనిపించడమేకాదు బోలెడు విషయాలు చెప్పాడు. వస్తూనే అతడన్నది ఆంధ్రోళ్ళు అంటే పెట్టుబడిదార్లు ఆంధ్రాలో చేసింది అస్సలు ఉద్యమమేకాదుట. ఉద్యమమంటే తెలంగాణాలో జరుగుతున్నదేట. ఇంకా శ్రీకృష్ణ కమీషన్‌పై అతడి అభిప్రాయలు కొన్ని చెప్పాడు. అసలు తెలంగాణా ఇవ్వాలా వద్దా అని రాష్ట్రంలో ఎవ్వరినీ అడక్కూడదట. ఆంధ్రోళ్ళనిగానీ, సీమోళ్ళనిగానీ, హైదరాబదీలనిగానీ. మరి ఎవరిని అడగాలి? పులకేసిని అడగొచ్చంట, ఇంకా వాళ్ళ అల్లుడిని అడగొచ్చుంట, ఇంకా పులకేసి కూతురునికూడా అడగొచ్చంట. తెలంగాణా ఇవ్వాలని తేల్చడానికి పదినెలలెందుకు అని తెలివిగా అడిగాడు. కేవలం పది సెకన్లు చాలుట. లేదంటే ఒక వారమో పదిరోజుల్లోనో సరిపెట్టుకోవాలిట. అసలు తెలంగాణా ఇవ్వడంకోసమే కమిటీ వెయ్యాలిగనీ ఇంకా అడిగేదేంటని అన్నాడు మా పులకేసి. ఇక తాము త్యాగాలు చేయక తప్పదని కూడా చెప్పాడు. అంటే ఆయన ఇంతకుముందు ప్రకటించినట్టు తల నరుక్కుంటాడేమోన్ని ఆశగా ఎదురు చూసేరు... అదేమికాదు. పదవులకు మరోసారి రాజీనామాలు చేసి, వాటిని నిజ్జంగా ఆమోదింపచేసుకుంటాడుట. అదీ సంగతి!! ఇకనుండీ మళ్ళీ కొన్ని రోజులు అందరికీ ముఖ్యంగా నక్సలైట్ చానల్స్‌కి, పోరంబోకు చానల్స్‌కి పండగే పండుగ. మనం కుడా చూసి సరదా పడదాం. ఏమంటారు?
February 2, 2010
మృగ్యమౌతున్న మానవ బంధాలు
చిన్నారి వైష్ణవి చనిపోయింది. కాదు చంపబడింది. అందుకు పురిగొల్పింది స్వయానా ఆ చిన్నారి మేనమామట. ఆ వార్త విని తట్టుకోలేక ఆమె తండ్రి ప్రభాకర్ చనిపోయాడు. ఇలాటి సంఘటనలు మనం ఇరవై నాలుగు ఘంటలు ప్రసారమయ్యే టీవీ సీరియళ్ళలో మాత్రమే చూసి ఉంటాము. సీరియళ్ళలో ఆడవిలన్లు కోపంగా రెండుకోట్లు ఖర్చైనా వాడి అంతు చూడాలి అనడం మనం చాలసార్లు చూసి ఉన్నాము. ఇవి అంతరిస్తున్న మానవ బంధాలు తెలియచేస్తాయి. పాత సినీమాల్లో అయితే భార్య గయ్యాళిదైతే త్యాగం చేసి ఉన్న ఆస్తిని వదులుకొనె హేరో ఊరొదిలి వెళ్ళిపోతాడు. చివరకి హీరో భార్య అతని మంచితనం తెలుసుకొని అతడిదగ్గిరకు చేరుకుంటుంది.లేదా వైస్-వెర్సా. కాని ఇప్పటి సీరియళ్ళు అలా కాదు. భార్య భర్తల మధ్య మనస్పర్ధలు వస్తే భర్త్యను చంపించడానికి రెండు బ్రీఫ్‌కేసులనిండా డబ్బును విలన్‌కీచ్చి భర్తను చంపమంటుంది. లేదా భర్తే భార్యను చంపించడానికి ప్లాన్లు వేస్తాడు. ఈ రెండూ కాకుండా తన పూర్వపు భార్య ఎదురుగా మరో స్త్రీతో కాపురం పెట్టడం. ఇది అవతలివారికి ఎంత కడుపుమంటను కలిగిస్తుందో హావభావాలతో సీరియళ్ళలోనే మనం చూసి ఉన్నాము. తన అక్కకు, అక్క పిల్లలకు జరిగిన అన్యాయానికి తమ్ముడు ఏ విధంగా మండిపడతాడో కూడా మనకు తెలుసు. మరి మనుషులని చూసి సీరియల్స్ తయారు చేస్తారో లేక సీరియల్స్ ను చూసి మనుషులు అలా తయారవుతారో? పెద్దలు చేసిన పాపాలు పిల్లలకు తగులుతాయని మన పూర్వీకులు ఉత్తినే అనలేదు. కానీ పిల్లలు చేసిన పాపమేమిటో? ఏమైనా ఇవి అంతరించి పోతున్న బంధాలకు ఒక తార్కాణం. ఇలాటి విషయాలలో పోలీసులు నిమిత్తమాత్రులే!!
డబ్బూ డబ్బూ నువ్వేమి చేస్తావూ అంటే... ఆప్తులమధ్య వైరాన్ని సృష్టిస్తానూ అందిట!!
February 1, 2010
వైష్ణవిని చంపేశారు దుర్మార్గులు!!
చినారి చిట్టితల్లి, టీవీలో చిత్రాలలో చిరునవ్వులు ఒలకబోస్తూ అమాయకమైన కళ్ళు గోళీల్లా తిప్పుకుంటూ పుట్టినరోజుగాబోలు జరుపుకున్న కన్నతల్లి, నిండా పదేళ్ళనా లేని పసిమొగ్గ దుర్మార్గుల కర్కశత్వానికి బలైపోయింది. కిడ్నేపైన ఆ చిన్నారి గుంటూరులో నిర్జీవంగా దొరికింది. ఆమె మృతదేహాన్ని కునుగొన్నారని టీవీలో చూసినప్పుడు కళ్ళు చెమ్మగిల్లాయి. దారికాచి కారు డ్రైవర్‌ను హత్యచేసినప్పుడే కిడ్నాపర్ల రాక్షసత్వం తెలిసింది. అటువంటి రాక్షసులను ఎంతో సున్నితంగా ఎదుర్కోవాలి. ఎందుకంటే చిన్నారి వారి చేతుల్లో ఉందికాబట్టి. ఆ చిన్నారి ప్రాణాలతో బైటకు వచ్చేదాకా ఓపికబట్టి తరువాత దోషులను దొరకబుచ్చుకోవాలి. మీడియా చేస్తున్నది మంచో చెడో తెలియని పరిస్తితి. మీడియా చూపిన అత్యుత్సాహంకూడా ఆమె ప్రాణాలమీదకు తెచ్చిందేమో అనిపిస్తోంది. ఆమె ఫొటోను చూపిస్తూ గంటలు లెక్కిస్తూ పోలిసులు చేస్తున్న గూఢచర్యాన్ని ఎప్పటికప్పుడు బట్టబయలు చేస్తూ ఆ సంఘటనను ఒక పెద్ద వివాదంగా మార్చకుండా ఉంటే ఆమె తండ్రివద్దనుండీ కొంత సొమ్ము దొరకబుచ్చుకొని ఆమెను వదిలేశేవారేమో? అప్పుడా చిన్నారి ప్రాణాలతో బైటపడి ఉండేదేమో. కానీ పోలీసుల చేతలు ఎప్పటికప్పుడు చెప్పివేస్తూ వారి ఆచూకీ దొరికే అవకాశం ఏర్పడిందన్న సందర్భములో తప్పించుకోవీలులేక దుర్మార్గులు ఆ చిన్నారిని చంపివేసి ఉంటారు. వారు క్షమార్హులు కారు. ముమ్మాటికి వారిని పట్టి ఉరికంబం ఎక్కించాలి. ఇప్పుడు మీడియావాళ్ళు ఆ చిన్నారి తల్లిదండ్రుల రోదనలు క్లోజప్‌లో బంధించడానికి ఆపసోపాలు పడుతూ ఉంటారు. మీడియాకు ఎప్పుడూ ఒక విషయం కావాలి. వైష్ణవి తల్లిదండ్రులకు మన సానుభూతిని తెలియచేయడంతప్ప మనమేమి చేయగలం?
January 25, 2010
తలలు బోడులైన తలపులు బోడులౌనా?
తెలంగాణా ఉద్యమంలో ఒకవ్యక్తి ముగ్గుబుట్టలంటి జుట్టుతో వేదికలను అలంకరిస్తూ ఉండేవారు. నెమ్మదిగా ఏకు మేకైనట్టు, తొండ ఊసరవెల్లిగా మారినట్లుగా ఆయన తన స్వరూపాన్ని మర్చుకుంటూ ఒక కరడుగట్టిన రాజకీయవేత్తగా మారుతూ కాకలు తీరిన రాజకీయవేత్తలనే హెచ్చరించే స్థాయికి చేరాడు. ఆయన మరెవ్వరో కాదు కోదండరాం. ప్రొఫెసర్ కోదండరాం. మేధావిగా తెలంగాణా ఉద్యమంలో అడుగుపెట్టి రాజకీయ జేఏసీలో కన్వీనర్ స్థానాన్ని ఆక్రమించిన ఈయన తాను ఒక ప్రభుత్వ ఉద్యోగి అని మరచిపోయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాప్రతినిధులను విమర్శిస్తూ వారిని రాజీనామాలను సమర్పించాలని డిమాండ్ చేయడమే కాకుండా ఈయన కోరే గొంతెమ్మ కోరికలు, వ్యాఖ్యానాలూ కూడా ఏ రాజకీయవేత్త చేయలేడు. గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ తెలంగాణా విద్యార్దుల పరీక్షా పత్రాలు మార్కుల కొలమానానికి ఆంధ్రా ఉపాధ్యాయులకు పంపకూడదని వీరి మొదటి కోరిక. ఆవిధంగా పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిని అపవిత్రం చేయాలనుకున్న సదరు ఈ వ్యక్తి ఒక రాజకీయ జేఏసికి కన్వీనర్ ఎలా కాగలిగాడో? తెలంగాణా పౌరుడిగా ఆయన తన అభిప్రాయాన్ని చెప్పడంలో తప్పులేదుగానీ ఒక రాజకీయ కూటమికి కన్వీనర్‌గా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండడానికి వీలులేదు. పైగా అతడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మద్దతును కూడగడుతున్నదుకు ఆయనను సత్వరమే సస్పెండ్ చేసి ప్రభుత్వ వ్యతిరేక కుట్రలు పన్నుతున్నందుకు ఆయనను ప్రాసిక్యూట్ చేయాలి. ఈయననే కాదు, ప్రభుత్వ జీత భత్యాలు తీసుకుంటూ ఉద్యమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరినీ సస్పెండ్ చేయాలి. గత కొంతకాలం క్రితం తమిళనాడులో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకే రాజపత్రంతో రెండు లక్షలమంది ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ చేసిన సంఘటనను న్యాయస్థానం కూడా సమర్ధించింది. ప్రభుత్వం చూపుతున్న ఈ ఉదాసీనతను చేతగానితనంగా భావిస్తున్న అందరినీ ఒక దారికి తీసుకురావలసిన భాద్యత ప్రభుత్వానిదే.
January 20, 2010
ఎవరికోసం ఈ త్యాగాలు?

వరంగల్ జిల్లాలో రెండేళ్ళ పిల్లవాడు బోరుబావిలో పడి ప్రాణలకోసం కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఆంధ్రదేశమంతా ప్రార్ధనలు చేసింది, ఆ బిడ్డ ప్రాణాలు కాపాడమని. ఆ బిడ్డ ప్రాణాలు పోయాయని తెలిసినప్పుడు అందరూ ఒక్కలా కన్నిరుమున్నీరై విలపించారు. అది మానవత్వం. కానీ రాష్ట్రాన్ని విభజించండీ అంటూ తనకుమాలిన కోరికలతో ఆత్మత్యాగాలు పేరిట ప్రాణాలు తీసుకుంటున్న యువకులపట్ల అందరూ అలా స్పందిస్తున్నారా? కొంతమందైతే కావచ్చుగానీ ఖచ్చితంగా అందరూ కాదు. వారి ప్రాణాలు కోల్పోయినందుకు బాధపడ్డా ప్రజలు శాపనార్ధాలు పెట్టేది మాత్రం దిక్కుమాలిన రాజకీయనాయకులనే. ఇరవై ఏళ్ళ వయసులొ సమైక్య ఆంధ్రలో వ్యక్తిగతంగా వీళ్ళు పడ్డ కష్టమేమిటో, ప్రత్యేక రాష్ట్రంలో వీరు అనుభవించబోయే భోగ భాగ్యాలేమిటో వీరికి తెలుసా? నువ్వు నష్టపోయావు అంటే కాబోలు అనుకునే ప్రజలున్నంత వరకూ ఈ మృత్యుహేల కొనసాగుతూనే ఉంటుంది. చనిపోయినవాడు చేసినది పిచ్చి పని అని అందరూ ముక్త కంఠంతో ఖండించాల్సింది పోయి, నీది మహోన్నత త్యాగం, నువ్వు అమరుడవు, నీ త్యాగాన్ని తెలంగాణా ప్రజలు మరచిపోలేరు అంటూ మరింతమందిని ఆత్మహత్యలకు పురిగొల్పే వీళ్ళు నాయకులా? వీళ్ళు ఉద్యమకారులా? రాజకీయ జేఏసీలో ఎవరైనా ఒక్కరు ఆత్మాహుతి చేసుకొని తమ అమరత్వాన్ని చాటుకోవచ్చుగా. వాళ్ళ పదవులు వదులుకోవడానికే మల్లగుల్లాలు పడే వీళ్ళు ప్రాణాలు పణంగా పెడతారా?
తెలంగాణా ఉద్యమంలో ఎన్నో దృక్కోణాలు. ఎవరి స్వార్ధం వారిది. ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొనె కోట్లకు పడగలెత్తినవాళ్ళూ లేకపోలేదు. ఓయూ విద్యార్దుల జేఏసీకి అక్షరాలా మూడు కోట్ల రూపాయలు అందాయని సమాచారం. వాటి పంపకంలో విద్యార్ధుల మధ్య ఎన్నో లుకలుకలు నడుస్తున్నాయన్నది మీడియాలో ప్రస్తుత కధనం. కానీ ఎవరికీ బైటపెట్టే దమ్ములేదు. ఇవేమీ తెలియని అమాయక విద్యార్ధులు తమవంతు త్యాగాలను చేస్తునే ఉన్నారు. ఇంతవరకూ పదండి ముందుకు అంటూ జనాన్ని ఎగదోసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి పదవులకు రాజీనామా అనేసరికి, ప్రభుత్వం పడిపొతే (తనకు) తెలంగాణాకు నష్టం అంటూ మరో పల్లవి అందుకున్నారు.
ఏదిఏమైనా అన్నీ సద్దుమణగాలంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి. రెచ్చగొట్టే నాయకులను నోరు మూయించి లోపల వెయ్యాలి. ముఖ్యంగా న్యూస్ చానల్స్‌ను కూడా కొంతకాలం ప్రసారాలు నిలుపు చేయించాలి. ప్రశాంత వాతావరణం ఏర్పడ్డాక ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి సరియైన నిర్నయం తీసుకోవాలి. బహుశా జరుగబోయేది అదే కావచ్చు!!
January 18, 2010
రంపపు కోతలాంటి రాతలెందుకో?
బ్లాగుల్లో కొన్ని టపాలు చదువుతూ ఉంటే చిన్న చిరునవ్వు అలా మెరిసి చటుక్కున మాయమౌతుంది. అలా అనిపిస్తే ఆ టపాకు ఒక సార్ధకత చేకూరినట్టే. టపా బాగున్నప్పుడు కామెంటడానికి బాగుంది అని చెప్పడం రోటీన్ అనిపించినప్పుడు నేనైతే చిన్న చిరునవ్వు :) వదిలిపెడతాను. నేను చదివాను మీ టపా నాకు నచ్చింది అని చెప్పడానికి. కానీ కొన్ని బ్లాగరుల రూటే వేరు. వారు ఏది చేసినా ఒక సంచలనం కోరుకుంటారు. అది వ్యతిరేకతతో కూడినదైనా సరే. వారి రాతలలో ఎన్నో నికృష్ట భావాలు కనబడుతూ ఉంటాయి. మనుషులలో నిబద్దత వీరికి నచ్చదు, సమాజమంటే ఏవగింపు, మనుషులపై అకారణ ద్వేషం వీరి రాతల్లో కనబడతాయి. సమాజంలో ఒక్క మంచి సంఘటన కూడా వీరి కంటికి కనబడదు. పదిమంది మెచ్చినది వీరు మెచ్చరు. పదిమంది చీ అంటే వీరు అద్భుతం అంటారు. అదేమి మిత్రమా అని అడిగితే కొన్ని పడికట్టుపదాలతో వీరు అర్ధం కాని భావాలెన్నొ చెప్పగలరు. పైగా ఇది నా బ్లాగు, నా ఇష్టం అంటారు. మరింత ముదిరితే మిమ్మలని నా భావాలతో ఏకీభవించమని నేను అడగలేదు, అసలు నా బ్లాగు చూడమని కూడా చెప్పలేదు అంటారు. కొన్ని టపాలు చదివినప్పుడు కొందరికి కలిగే భావాలు ఎలా ఉంటాయొ చిన్న ఉదాహరణ ఇస్తున్నాను.
"అయితే మీ శ్రేయోభిలాషిగా మీకోమాట చెబుదామనుకుంటున్నాను. లౌకికవాది అనే ముసుగు వేసుకున్నాను గదా నేనేంటో అసలెవరికీ తెలియదులే అని మీరు ఇంకా అనుకుంటూనే ఉన్నారు గదా! కాని అది తప్పు సార్.. ఆ ముసుగు చాలా పల్చగా ఉంది. ముసుగులోంచి మీ వంటిమీది చారలు స్పష్టంగా కనబడిపోతున్నాయి. క్రూరమైన కోరలు (కరాళ దంష్ట్రలవి :) ) నోట్లోంచి కారుతున్న చొంగా కనిపిస్తూనే ఉన్నాయి. అసహనం కారణంగా మీ గొంతులోంచి వచ్చే గురక వినిపిస్తూనే ఉంది. ఇక దాచలేరు సార్, ఆ ముసుగు తీసెయ్యండి. అసలు రూపును బయటపెట్టండి"
మనం రాసిన రాతలకు అవతలివారికి ఎంత ఒళ్ళు మండితే ఇలాటి కామెంట్లు వస్తాయి చెప్పండి. మన టపా చదివిన అందరికీ నచ్చాలని లేదు కానీ, చాలా మంది అసహనాన్ని వెళ్ళగక్కితే దానిలో కొంత లోపమున్నట్టే. మీరేమంటారో?
Subscribe to:
Posts (Atom)