July 13, 2009

కడుపు మంట - రకాలు

మనుషులకు వచ్చే కడుపు మంటలో రెండు రకాలున్నాయి. మొదటిది టీలు ఎక్కువ తాగడం, సిగరెట్లు కాల్చడం, సమయ పాలన లేని భొజనాలవల్ల ఎసిడిటీ పెరిగి వచ్చే కడుపు మంట. ఈ వ్యాధిని డాక్టర్ నయం చెయగలడు. రెండోది మనవల్ల ఇతరులకు వచ్చే కడుపు మంట.అంటే ఆఫీసులో బాసుకు మన పని నచ్చి ప్రమోషన్ ఇచ్చాడనుకోండి. మన కొలీగ్స్‌కు కడుపు మండవచ్చు. అలాగే అద్దె ఇటిలో ఉండే మనం ఒక సొంత ఫ్లాట్ కొనుక్కొని మారి పోతున్నామనుకోండి, ఆ అద్దె ఇంటి ఓనరుకి కడుపు మండవచ్చు. రోజూ డొక్కు స్కూటర్‌మీద తిరిగే మనం కొత్త బైక్‌గానీ కొత్త కారుగానీ కొన్నామనుకోండి, మన పక్క ఫ్లాట్లోని వాళ్ళకి కడుపు మండవచ్చు. పెళ్ళికాని మనకు, మనకు తెలిసిన పెళ్ళైనవాళ్ళందరూ రోజూ "ఇంకా ఎన్నాళ్ళు? ఇంకా లేటైపొతే పెళ్ళి చేసుకుందమాన్న దొరకరు" అని సలహాలిచ్చే సమయంలో ఒక అందమైన పెళ్ళాం దొరికిందనుకోండి, సలహాలిచ్చినవాళ్ళందరికి కడుపు మండవచ్చు. మా అబ్బాయి క్లాసులో జెం, ఎప్పుడూ ఫస్టు రాంకే అని ఫోజు కొట్టే పక్కింటి అంకుల్, ఈ సారి వాళ్ళబ్బాయికి పదవ రాంక్ వచ్చి మనవాడికి ఫస్ట్ రాంక్ వచ్చిందనుకోండి, అంకుల్‌కి కడుపు మండవచ్చు. మనింటిలో లేని వస్తువుగురించి పక్కింటి ఆంటీ రోజూ గొప్పగా చెపుతున్న సమయంలో మనంకూడా ఆ వస్తువు కొనేసామనుకోండి, ఆంటీకి కడుపు మండవచ్చు. నేను వాడే వస్తువులన్నీ ఇంపోర్టెడే, లొకల్ వస్తువులు నేను వాడను అని ఫోజ్‌కొట్టే అంకుల్‌కి, నాక్కూడా మా అబ్బాయి అమెరికానుండీ సెల్‌ఫోన్ పంపించాడని చూపించామనుకోండి, అప్పుడా అంకుల్‌కి కడుపు మండవచ్చు. ఇన్ని రకాల కడుపు మంటలున్నాయన్నమాట! ఈ మంట చాలా మందికి లేకపోయినా ఒక్కొక్క సందర్భంలో బైట పడుతుంది. దీనిని ఏ డాక్టరూ నయం చేయలేడు.ఈ రకం కడుపు మంట వచ్చినప్పుడు ఆ వ్యక్తులు విచిత్రంగా ప్రవర్తిస్తారు. కారు కొన్నామని పక్కింటి అంకుల్‌కి చెప్పేమనుకోండి, వెధవది రెండు లక్షలు పెడితే కారు. ఈ ట్రాఫిక్‌లో కారునడపడం అంత చిరాకు మరేది లేదు. నేనైతే ఎప్పుడైనా కావాలంటే టాక్సీని పిలుచుకొనె దర్జాగా వెళ్ళి వస్తాను అంటాడు. మనవాడికి ఫస్ట్ రాంక్ వచ్చిందని చెపితే, ఏమి చదువులో ఏమి స్కూళ్ళో, పిల్లలనందరిని కూర్చోబెట్టి రుబ్బించేస్తున్నారు.మా కాలంలో ఇలా కాదు అంటాడు. నాకు పెళ్ళి కుదిరింది అంటూ పెళ్ళికూతురు ఫొటో చూపించామనుకోండి, అందం కొరుక్కుతింటామా ఏమిటి, అమ్మాయి నెమ్మదిస్తురాలో కాదో కనుక్కున్నావా అంటారు. ఇది చాలామందికి ఉండే కడుపు మంట. ఇలాంటివాళ్ళని సంతృప్తి పరచడానికి మార్గాలు వెదకాలి. ఉదాహరణకి కారుగాని, బైక్ గాని కొన్నాక, పక్కింటాయనకి కారు కొని అలా తీసుకొస్తున్నానో లేదొ ఆటోవాడు వచ్చి గీత పెట్టేసాడని చెపితే ఆయన కారుకు లేద బైక్‌కి పడ్డ గీతని చూడటానికి ఆనందంగా వస్తాడు. మనం చేసిన పనుల్లో మైనస్ పాయింట్లు ముందుగా వీళ్ళకి చెప్పేస్తే వాళ్ళు ఆనందపడతారన్నమాట. వీళ్ళ కడుపు మంటకి అదే మందు.
సూచన: కడుపులో ఎటువంటి మంటలు లేనివారు స్థితప్రఙ్నులని భగవత్‌గీతలో చెప్పబడింది.

3 comments:

Anonymous said...

కడుపుమంట కంటె, నివారణోపాయాలు బాగున్నాయి !!

Indian Minerva said...

డిట్టో... డిట్టో...

Shashank said...

గురు బా చెప్పావ్. చేసుకున్నోడికి చేసుకున్నంత. నాకు మండేది ఏంటంటే అవసరమున్నా లేకున్నా పక్కనోడు కొన్నాడు కాబట్టి నేను కొనాలి/ చేయాలి అన్న మెంటాలిటి. ఇదేమైన కాంపిటీషనా .. ఇది జీవితం. ఈ విషయం తెలీక చాలా మంది అనవసరపు ఖర్చులు చిచ్చులు పెట్టుకు తిరుగుతారు. "ఎవడెట్టపోతే మనకేంటిలే" అని అనుకుంటే అన్ని సరిపోతుంది కద?