December 16, 2009

రోశయ్యగారి బుజ్జగింపులు ఆంధ్ర మంటలను చల్లార్చవు

రోశయ్యగారు మొత్తానికి మంత్రివర్గాన్ని బుజ్జగించి ఒకచోట కూర్చోబెట్టగలిగారు. మంత్రివర్గంలో విబేధాలు లేవు అన్న సూచన రాష్ట్ర ప్రజలకు తెలియచేయడానికట. మంత్రివర్యులు గీతారెడ్డి చక్కగా ముస్తాబై మంత్రివర్గ బేఠీ జరిగిందని ఇక పరిపాలనపై దృష్టి సారిస్తుందని ఇక ఎలాంటి సమస్యలు లేవన్న బిల్డప్ ఇచ్చారు. కాని నిప్పుని దుప్పట్లో దాచి ఉంచితే దుప్పటి కాలడం ఖాయం. ఈ బుజ్జగింపు కేవలం ప్రధాని చేసే ప్రకటన వరకే. ఇరువర్గాలను సంత్రుప్తి పరచడం అనేది జరిగే పని కాదు. హైదరాబాదును రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా ప్రకటిచడంగానీ కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించి బుజ్జగించడానికి కొంతవరకు అస్కారం ఉంది. ఇక చిరంజివి కూడా సమైక్య ఆంధ్రా నినాదంతో బైటికి వచ్చారు. ప్రజల అభిష్టానికి ఎవరైనా తల ఒగ్గక తప్పదు. పార్లమెంటులో జగన్ తెలుగుదేశం నాయకులతో చేతులు కలిపి సమైక్య ఆంధ్ర ప్లకార్డు చూపించినందుకు ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని తెలంగాణా ఎంపీలు అక్రోసిస్తున్నారు. జగన్ చేతులు కలిపింది సాక్షాత్తూ పార్లమెంట్ సభ్యులతోనేగానీ విదేశీ శక్తులతో కాదు. ఇక జై ఆంధ్రా ఉద్యమానికి వ్యతిరేకంగా శాయశక్తులా ప్రయత్నిస్తున్నది ఎలక్ట్రానిక్ మీడియాలోని కొన్ని వార్తా చానల్స్.తెలంగాణా నాయకుల ప్రసంగాలకు ఇస్తున్న సమయముగానీ ప్రాముఖ్యము గానీ ఆంధ్రా ఉద్యమ నాయకులకు ఇవ్వడంలేదన్నది సుస్పష్టం. చిరంజీ జై ఆంధ్రా అన్నందుకు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కన్న తెలంగాణలో పీఆర్పీ చీలిపోతున్నది అన్నదానిని పెద్ద పెద్ద అక్షరాలతో చూపిస్తున్నారు. పీఆర్పీకి తెలంగాణాలో ఉన్నది కేవలం రెండు సీట్లు. గుడ్డికన్ను మూసినా తెరిచినా ఒక్కటేనని వీరికి తెలియదా? చర్చలలోగానీ న్యూస్ ఇవ్వడంలోగానీ వారి వక్రబుద్ధి బైట పెట్టుకుంటున్నారు. కేసీఅర్ దీక్ష చేస్తున్న పదకొండు రోజులు స్క్రీన్‌పై సగం ఆయన ఫొటో ప్రసారం చేసారు.మరి ఆంధ్రా యూనివర్సిటీ, విజయవాడలలో ఎంతోమంది దీక్షలు చేస్తూ ఎంతోమంది అస్వస్తులవుతున్నారు. ఆంధ్రలో అగ్నిగుండాలు రగులుతూంటే అందాలభామల పోటీలను గంటలకొద్దీ చుపిస్తున్న ఈ చానల్స్ యొక్క యాజమాన్యాలు మేల్కొనాలి. ఇలాంటి చానల్స్‌ను ఆంధ్రా రాయలసీమ ప్రాంతాలలో నిషేధించి కేబుల్ ఆపరేటర్లు ఆ చానల్ ప్రసారాలను నిలిపివేస్తే టీఅర్పీ రేటింగ్స్ తగ్గి ఆదాయం రాక చానల్స్ మూసుకోవలసిన పరిస్తితి వస్తుంది. కాబట్టి వార్తా ప్రసారాలలో ప్రజా వాణికి ప్రాధాన్యం ఇవ్వాలి. సమస్య ఏదో ఒకనాడు పరిష్కరించబడుతుంది. కానీ మీరు ఎప్పటికీ ప్రజలమధ్య ఉంటారన్న విషయం గుర్తుంచుకోవాలి.

1 comment:

సత్యాన్వేషి said...

అన్ని మీడియా చానెల్స్కూడా ఆంధ్రా వాల్లవే గదా? వాల్లు తెలంగాణాకు ఎలా అనుకూలం? చిరంజీవి ఇచ్చిన స్టేట్మెంట్ ఎక్కువగా చూపిస్తే జనం ఉమ్మేస్తారని కాబోలు చూపించ్లేదు.

ఇకపోతే అంతా బాగో లేదని మీరే చెప్పారు. పార్టీలు పార్టీలు నిలువునా చీలిపోయాయి. ఇలంటి పరిస్థితి లొ కలిసి ఉండెది ఎవరిని ఉద్ధరించడానికి? ఆంధ్రా వాల్లు అక్రమంగా హైదరబాద్ లొ ఆక్రమించుకున్న భూములను కాపాడ్డానికా?

ఇకపోతే పోలిసులు..తెలంగాణా లో ఉస్మానియా యునివర్సిటీ లో జొరబడి విద్యార్థులపై లాఠీ ఝులిపిస్తారు, కానీ ఆంధ్రా వాల్లు గోడౌన్లు తగలబెడుతున్నా చూస్తూ కూర్చుంటారు.