July 2, 2009

గిన్నిరొట్టె కధా కమామిషు!!

మా పెద్ద పరీక్షలు ఐపొయాక వేసంగి శెలవలు ఇచ్చేవారు. అప్పటికే ఎండలు మొదలయ్యేవి.నేను కాస్త సుకుమారుణ్ణే. కొద్దిగా ఎండ తగిలితే చాలు ఒళ్ళంతా పేలి ఎర్రగా ఐపోయేది. అందుకు మా అమ్మ ఇల్లు కదలనిచ్చేది కాదు. పదకొండు కాగానే నేను ఎక్కడ ఉన్నా వెదికి పట్టుకొని ఇంటికి లాక్కు పోయేది. మాది పెంకుటిల్లే. ఎండలు ఎక్కువ ఉన్నా ఇంత బాధించేవి కావు. పెంకుటిల్లు మూలాన వేడి తెలిసేది కాదు. మరీ ఎక్కువ ఉక్కగా అనిపిస్తే పెరట్లో చెట్లకింద చేరే వాళ్ళం. పెరట్లో వేప అరటి నందివర్ధనం చెట్లు నిండుగా ఉండేవి.వేప చెట్టుకింద మడత మంచం వేసుకొని పడుకొనేవాళ్ళం. పైనుండి వేప ఆకులు, చిలుకలు ఉడతలు కొరికి పారేసే గింజలు మీద పడుతూఉంటే వాటిని చేత్తో తీసివేస్తూ పడుకొనేవాళ్ళం. మధ్య మధ్యలో కాకులు కొన్ని చిలిపి పనులు కూడా చేస్తూ ఉండేవి.ఎండ వేడికి నాకు ఒళ్ళు పేలిపోయి మరీ చిట చిటలాడుతోందని గొడవ చేస్తే మధ్యాహ్నం పన్నెండు గంటలకి భొజనాలు అయ్యేక గంధం అరగదీసి ఒంటికి రాసేది. ఆ చల్లదనానినికి హాయిగా నిద్ర పట్టేది. మళ్ళీ ఏ మూడు లేక నాలుగు గంటలకో మెలుకవ వచ్చేది. లేచేటప్పటికి మా అమ్మ నాకిష్టమైన గిన్ని రొట్టె సిద్ధంగా ఉంచేది.గిన్నె రొట్టె అంటే దాదాపు ఇడ్లీ పిండిని చేసినట్టే ముందురోజు చేసి ఉంచేది. దానిని ఉదయం పదకొండు గంటలకి కుంపట్లో బొగ్గులు వేసి దానిపై ఒక ఇత్తడిగిన్నె ఉంచి దానిలో కొంచం నూనె వేసి ఈ పిండి పొసేది. దానిపై మరో ఇత్తడి మూత ఉంచి దానిపైకూడా నిప్పులు పోసి ఉంచేది. రెండువైపుల ఆ నిప్పుల సెగకి నెమ్మదిగా కాలుతూ మధ్యాన్నానికి ఆ రొట్టె ఎర్రగా కాలి కమ్మని వాసనలొతో తయారయ్యేది. అప్పుడు దానిని బైటికి తీసి ముక్కలుగా చేసి దానిపై నేయి వేసి కొత్త ఆవకాయతో నంచుకు తింటే ఆ మజానే వేరుగా ఉండేది. ఇప్పటి పిజ్జాలుగానీ బ్లాక్ ఫారెస్టులుగాని ఎందుకూ పనికి రావు. మధ్య మధ్యలో మా అమ్మకు దొరకకుండా నేను పారిపొయేవాడిని. చింత చెట్లకింద పిల్లలం అందరూ చేరేవాళ్ళం. నెమ్మదిగా చింత చిగురు కోసి దానిని ఒక నాపరాయి మీద ఉంచి మరో రాయి తో మెత్తగా చితకగొట్టి పిల్లలు ఇంటినుండి దొంగచాటుగా తెచ్చిన ఉప్పు కారాలు కూడా దానిలో కలిపి ఆ చాట్‌ను అందరం ఎంతో అప్యాయంగా తినేవాళ్లం. నాపరాయి మీద వేసి కొట్టేటప్పుడు దానిలో కలిసిన ఇసుక పళ్ళమధ్య పడి ఒళ్ళు గగుర్పొడుస్తున్నా ఒదిలిపెట్టేవాళ్ళం కాదు. సాయంత్రం ఐతే మా పడక ఇంటిముండు రోడ్డుమిదే మంచాలు వేసుకొని పడుకొనేవాళ్ళం. పైన చంద్రుడు, కొబ్బరి ఆకుల గలగలలు, కిందనుంది కొద్ది కొద్దిగా మట్టివాసనలు. ఒక్కప్పుడు అర్ధరాత్రి హఠాత్తుగా చినుకులు పదితే మంచాలు ఎత్తి ఇంటి అరుగుమీదకి మార్చుకొనేవాళ్లం. ఏమిటో ఉద్యోగం పేరు చెప్పి ఇక్కడికి వచ్చేశాకా గిన్నిరొట్టెగాని చింత చిగురు చాట్‌గాని మళ్ళి తినడం కుదరలేదు. మళ్ళీ మా వూరు వెళ్ళి మా అమ్మ చేతి గిన్ని రొట్టె, చింత చిగురు చాట్ తినాలని ఉంది. మీరూ వస్తారా?

6 comments:

Anonymous said...

తప్పకుండా...,

చదువుతుంటేనే నోరూరుతోంది. చాలా బాగా రాసేరు

- కాముధ

Alapati Ramesh Babu said...

meru denni genni rotti annaru kani maa intlo dibbarotti antham. maa aavda chesthundi adurs.ee rotti ki allapachhadi combination. rotti mariyu pechhu baga vunthai. karakara lodali anthe koddiga bombay ravva kalapali

Ram Krish Reddy Kotla said...

chala baaga rasarandi...mukhyamga inti mundu road meede padukovadam, artharathri chinukulu padithe mancham ettuukoni parigettam, ilantivanni naku anubhavapurvakame...me post chaduvutunte avanni gurthochai...nice

Kishen Reddy

Vinay Chakravarthi.Gogineni said...

baagundi............dibbarotte ante penam meeda vestaaru kada i think ginne rotti is different from dibbarotti

విశ్వామిత్ర said...

@ కాముధగారూ అమ్మ అప్యాయంగా చేసే వంటకంగదా ... అదంతా రుచిలో కనిపిస్తుంది. మీరుకూడా ప్రయత్నించండి.

@ రమేష్‌గారూ గిన్నె రొట్టె అంటే వినాయక్‌గారు చెప్పినట్టు గిన్నెలో వేస్తారు, దిబ్బ రొట్టెకన్న రెండింతలు లావు ఉంటుంది. అల్లప్పచడి కాంబినేషన్ కూడా బాగుంటుంది.

@ కిషన్ రెడ్డిగారూ .. హమ్మయ్య మీ అందరికీ పాత రోజులు గుర్తుకు తెచ్చాను. ముఖ్యంగా ఇవన్నీ అనుకొనేది పాత రోజులని మరోసారి తలుచుకోవడానికే కదండీ!

Dharanija said...

memu kooda chinta chat tega tinevallam.chala baagundi